బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశవ్యాప్తంగా ఆయనకు కోట్ల మంది అభిమానులున్నారు. ఆయన సినిమా విడుదలవుతుందంటే థియేటర్ల వద్ద హంగామా ఓ రేంజ్ లో ఉంటుంది. హిట్, ప్లాప్ అనే తేడా లేకుండా ఆయన సినిమాను చూడడానికి ఎగబడతారు. అయితే సల్మాన్ ఖాన్ నటించిన ‘రాధే’ సినిమా ఈద్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లతో పాటు ఓటీటీలో ఒకేసారి ఈ సినిమా విడుదలైంది.
నిజానికి థియేటర్ రిలీజ్ అనే మాట నామమాత్రానికే. ఎందుకంటే దేశంలో చాలా చోట్ల థియేటర్లను మూసేశారు. తెరిచి ఉన్న కొన్ని థియేటర్లకు కూడా ప్రేక్షకులు వెళ్లే పరిస్థితి ఇప్పుడు లేదు. దీంతో ఎక్కువశాతం మంది ఓటీటీల్లోనే సినిమా చూడడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ క్రమంలో ‘రాధే’ సినిమా జీ5, జీప్లెక్స్ ఓటీటీల్లో విడుదల కాగానే దాన్ని చూడడానికి ఎక్కువ సంఖ్యలో అభిమానులు ఒకేసారి లాగిన్ అయ్యే ప్రయత్నం చేశారు.
దీంతో ఓటీటీ సర్వర్లు క్రాష్ అయ్యాయి. సర్వర్లు ఆగిపోవడానికి గల కారణం సదరు ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించలేదు కానీ.. సమస్యను పరిష్కరిస్తున్నామని, త్వరలోనే మీ ముందుకు వస్తామంటూ ట్వీట్ చేసింది. కాసేపటికే సర్వర్లు యాధావిధిగా పని చేయడంతో ప్రేక్షకులు ఎలాంటి అంతరాయం లేకుండా సినిమాను చూశారు. భాయ్ రేంజ్ కి సర్వర్లు కూడా క్రాష్ అయిపోయాయంటూ సల్మాన్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రభుదేవా డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో దిశా పటానీ హీరోయిన్ గా నటించింది.