కృష్ణవంశీ దర్శకత్వంలో నటించాలనేది భాషతో సంబంధం లేకుండా ఏ కథానాయకుడికైనా, నటీమణికైనా ఒక కల. ఆ జాబితాలో యువ కథానాయకుడు సందీప్ కిషన్ కూడా ఉన్నాడు. ఇప్పుడు కృష్ణవంశీ దర్శకత్వంలో “నక్షత్రం” అనే సినిమాలో నటిస్తున్న సందీప్ కిషన్.. ఎప్పుడో 2009లోనే కృష్ణవంశీని పరిచయం చేసుకొనేందుకు ప్రయత్నించాడట.
2009లో కృష్ణవంశీకి తన మొబైల్ నుంచి మొట్టమొదటిసారి మెసేజ్ పెట్టాడట సందీప్ కిషన్. అతనికి కృష్ణవంశీ నుంచి రిప్లై లభించలేదనుకోండి అది వేరే విషయం. కానీ.. అప్పుడు కనీసం తన మెసేజ్ కు రిప్లై కూడా ఇవ్వని దర్శకుడి దర్శకత్వంలో నేడు హీరోగా నటిస్తుండడం తనకు చాలా సంతోషంగా సందీప్ స్వయంగా పేర్కొనడంతోపాటు.. సదరు మెసేజ్ స్క్రీన్ షాట్ ను తన ఫేస్ బుక్ ఎకౌంట్ లో పోస్ట్ చేశాడు. సో.. మనోడు 2009 నుంచి ట్రై చేస్తుంటే 2016లో వర్కవుట్ అయ్యిందన్నమాట.
ఇకపోతే.. “వెంకటాద్రి ఎక్స్ ప్రెస్” తర్వాత తన ఖాతాలో మరో హిట్టును చేర్చుకోలేని సందీప్ కిషన్ తాజా చిత్రం “ఒక్క అమ్మాయి తప్ప” కూడా దారుణంగా విఫలమవ్వడంతో.. తాజా చిత్రం “నక్షత్రం”పై చాలా ఆశలు పెట్టుకొన్నాడు. ఈ సినిమా హిట్టైతే తప్ప.. హీరోగా సందీప్ తన ఉనికిని కాపాడుకోవడం కష్టం!