కమల్ హాసన్ – రజనీకాంత్ కాంబినేషన్‌లో సినిమా రావడానికి కొన్ని నెలలు పట్టే అవకాశం ఉంది. ఈ ఇద్దరు నటులు ఇప్పుడు చేస్తున్న సినిమాలు పూర్తి చేసి.. ఆ సినిమా స్టార్ట్ అవ్వాలి. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రావాల్సిన ఆ సినిమా కంటే ముందే ఈ ఇద్దరు లెజెండ్‌ల కాంబినేషన్ మనం చూడొచ్చు. అయితే అందులో ఒకరు హీరోగా, మరొకరు నిర్మాతగా అన్నమాట. ఈ సినిమా ఇటీవల షూటింగ్ ప్రారంభించుకుంది. ఈ క్రమంలో ఓ ఆసక్తికర విషయం ఒకటి బయటకు వచ్చింది.
అశ్వత్ మరిముత్తు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు ‘ధర్మన్’ అనే పేరు పెట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో కథానాయికలుగా సిమ్రన్, రాశీ ఖన్నాను తీసుకున్నారు. ఈ మేరకు సినిమా అనౌన్స్‌మెంట్ సమయంలో పోస్టర్‌లో వారున్నారు కూడా. అయితే ఇప్పుడు ఈ సినిమాలో మరో నాయిక కూడా ఉందట. అంతేకాదు ఆమె సినిమా సెట్‌లో అడుగుపెట్టింది కూడా అని కోడంబాక్కం వర్గాల సమాచారం. ఆమెనే కొత్త నేషనల్ క్రష్ రుక్మిణి వసంత్.
కన్నడ సినిమాలతో కుర్రకారు కలల రాణి అయిపోయిన రుక్మిణి.. ఇప్పుడు కన్నడ సినిమాను దాటి ఇతర పరిశ్రమల్లో వరుస సినిమాలు చేస్తోంది. అలా తమిళంలో రజనీకాంత్ సినిమాతో ఎంట్రీ ఇవ్వనుంది. ఇందులో ఆమె పాత్ర హీరోయిన్ కాకపోయినా కీలకంగా ఉంటుందని చెబుతున్నారు. అన్నట్లు ఆమెకు, కమెడియన్ యోగిబాబుకు ఆసక్తికర సన్నివేశాలు ఉంటాయి అని చెబుతున్నారు. ఇక ఈ సినిమా చాలామంది చేతులు మారి అశ్వత్ మరిముత్తు దగ్గరకు వచ్చిన విషయం తెలిసిందే.
అంతమంది దర్శకులు (రవికుమార్, సుందర్.సి, సిబి చక్రవర్తి)ను కాదని అశ్వత్‌కి ఈ సినిమా ఇచ్చారు అంటే ఈ కథలో ఏదో విషయం ఉండాలి. ఇందులో రజనీ డాక్టర్‌గా కనిపించబోతున్నారు అని పోస్టర్ చూసి చెప్పొచ్చు. మరి డాక్టర్ ధర్మన్ ఏం చేశాడు అనేది వెండితెరపై చూడాలి.