నాగచైతన్య కెరీర్ ఆదినుండి జయాపజయాలతోనే సాగుతోంది. ఒక హిట్ పడిన ఆనందం నుండి బయటపడేలోపు మరో సినిమా ప్లాప్ గా మారిపోతుంది. మామూలు హీరోలకి ఇలాంటి ఫలితం ఎదురైతే ఎలా ఉంటుందో గానీ ఒక స్టార్ కిడ్ కి ఈ రకమైన ఫలితం ఓర్వలేనిది. అందుకే ‘దోచెయ్’ పరాజయం తర్వాత తనకి తొలి హిట్ ఇచ్చిన గౌతమ్ మీనన్ కథనే నమ్మి అతడితోనే ముందడుగేశాడు నాగచైతన్య.
సినిమా అయితే మొదలెట్టారు.. ఆపై పూర్తి చేశారు గానీ దానికి మోక్షం కలిగించేందుకు మాత్రం సుమారు ఓ ఏడాది కాలంగా ఎదురు చూస్తూనే ఉన్నారు. తమిళ, తెలుగు భాషల్లో రూపొందిన ఈ సినిమా తెలుగు వెర్షన్ షూటింగ్ పూర్తైన తమిళ వెర్షన్ హీరో శింబు వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. కొద్దిరోజుల క్రితం ఆ పనులన్నీ ముగియడంతో విడుదల ఏర్పాట్లు మొదలెట్టిన చిత్ర బృందం నవంబర్ 11న సినిమాని విడుదల చేసేందుకు నిర్ణయించారు. మంజిమ మోహన్ ఈ సినిమాతో తమిళ, తెలుగు భాషల్లో హీరాయిన్ గా పరిచయం కానుంది. రెహమాన్ స్వరపరిచిన పాటలు ఇప్పటికే హిట్ కావడం, తెలుగు వెర్షన్ హక్కులు సక్సెస్ చిత్రాల నిర్మాతగా పేరు గాంచిన దిల్ రాజు చేతిలో పడటం సినిమా విజయంపై నమ్మకాన్ని పెంచాయి. ఇవి సరిపోవన్నట్టు ‘ప్రేమమ్’ పాజిటివ్ వైబ్స్ ఎటూ ఉండనే ఉన్నాయి. సో చైతూ ‘సాహసం..’ వృథా పోయే అవకాశమే లేదు.