అయిదు సినిమాల్లో రెండు పరాజయాలతో తన సినిమాల్లానే సాయి ధరమ్ తేజ్ కెరీర్ కూడా యావరేజ్ గా సాగుతోంది. తొలి సినిమా గనక “రేయ్” విషయంలో పర్లేదని సరిపెట్టుకున్నా మొన్నటికి మొన్న చూపించిన అతడి ‘తిక్క’ని మాత్రం ఎవ్వరూ క్షమించరు మెగాభిమానులతో సహా.
అయితే తర్వాతి సినిమాల రూపంలో అతగాడికి ఆ తప్పుని సరిదిద్దుకునే అవకాశం వచ్చింది. సుప్రీమ్, తిక్క సినిమాలను ఏకకాలంలో చేసిన సాయి ధరమ్ కొంత కాలంగా కెమెరాకి దూరంగా ఉన్నాడు. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో రానున్న సినిమా కోసం తన రూపురేఖలను మార్చుకుంటున్నాడు. ఫ్యాషన్ మేగజైన్ ఎడిటర్ గా ఈ సినిమాలో కనపడనున్న సాయి కృష్ణవంశీ ‘నక్షత్రం’ సినిమాలో సిన్సియర్ పోలీస్ గా కీలక పాత్ర పోషించనున్నాడు.
ఈ నెల 19 నుండి ‘నక్షత్రం’ షూటింగ్ లో పాల్గొననున్న సాయి 25 నుండి మలినేని సినిమాని సెట్స్ మీదికి తీసుకెళ్లనున్నారు. ఇలా రెండు సినిమాలతో యాక్షన్ షురూ చేయనున్నాడు ఈ మెగా హీరో.