బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కెరీర్ ప్రశ్నార్ధకంలో పడిన సమయంలో సౌత్ సినిమాలు రీమేక్ లు చేసి హిట్స్ అందుకున్నాడు. ‘పోకిరి’, ‘రెడీ’, ‘కిక్’ లాంటి సినిమాలను హిందీలో రీమేక్ చేసి క్రేజ్ పెంచుకున్నాడు. ఇప్పుడు మరో సౌత్ రీమేక్ లో సల్మాన్ ఖాన్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సంక్రాంతికి విజయ్ నటించిన ‘మాస్టర్’ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేశారు. భారీ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయాలనుకున్నారు.
అయితే తాజాగా హీరో ఎవరనే దానిపై క్లారిటీ వచ్చింది. బాలీవుడ్ మీడియా వర్గాల సమాచారం ప్రకారం.. సల్మాన్ హీరోగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్న. ‘మాస్టర్’ హిందీ రీమేక్ హక్కులను దక్కించుకున్న మురాద్ ఖేతాని, ఎండేమోల్ షైన్ లు సల్మాన్ తో నెల రోజులుగా ఈ సినిమా గురించి చర్చలు జరుపుతున్నట్లు బాలీవుడ్ మీడియా వార్తలు ప్రచురిస్తోంది. సల్మాన్ కి సినిమా లైన్ నచ్చడంతో రీమేక్ లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
అయితే హిందీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా మార్పులు చేయాలని సూచించాడట. పూర్తి స్క్రిప్ట్ ని సిద్ధం చేస్తే సినిమా చేసే విషయంపై ఓ నిర్ణయం తీసుకుంటానని సల్మాన్ చెప్పినట్లు తెలుస్తోంది. సల్మాన్ ఈ సినిమాను ఓకే చేస్తే ఆయనకి ధీటుగా సినిమాలో మరో హీరోని తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ నటించిన ‘రాధే’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అలానే ‘అంతిమ్’ అనే మరో సినిమాలో నటిస్తున్నాడు.