అక్కినేని నాగార్జున, సమంతలు మామకోడళ్ళలా కాకుండా మంచి స్నేహితుల్లా ఉంటారు. సోషల్ మీడియా వేదికపై ఒకరి సినిమా గురించి మరొకరు అభినందనలు గుప్పిస్తుంటారు. తాజాగా సమంత మామ గురించి అద్భుత కామెంట్ చేసింది. రామ్ గోపాల్ వర్మ, నాగార్జున కలయికలో తొలిసారి వచ్చిన శివ సూపర్ హిట్ అయింది. అటువంటి కాంబినేషన్లో పోలీస్ ఆఫీసర్ స్టోరీ రాబోతోంది. కొత్త నటి మైరా సరీన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి “ఆఫీసర్” అనే టైటిల్ ను పెట్టిన సంగతి తెలిసిందే.
ఈరోజు ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. అయితే ఇదివరకు రిలీజ్ చేసిన టీజర్స్ ని రెండు కలిపి ఈ ట్రైలర్ ని రిలీజ్ చేసినట్లు విమర్శలు వచ్చాయి. ఈ ట్రైలర్ సినిమాపై ఎటువంటి అంచనాలను పెంచలేకపోయింది. కనీసం ఆసక్తిని సైతం కలిగించలేదని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ విషయాలను పక్కన పెట్టిన సమంత ఈ ట్రైలర్ లోని నాగ్ లుక్ పై కామెంట్ చేసింది. “థియేట్రికల్ ట్రైలర్, పోస్టర్ రెండింటిలో నాగ్ చాలా సాలిడ్ గా కనిపిస్తున్నారు. మే 25వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నా” అని ట్వీట్ చేసింది. కోడలి ట్వీట్ మామ సినిమాకి ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాలి.