అభిమానుల పనులు కొన్ని సార్లు తారలను ఇబ్బందిలోకి నెట్టేస్తుంది. అసహనానికి గురి చేస్తుంది. ఇలాంటి చేదు అనుభవం క్యూట్ సమంతకు కూడా ఎదురైంది. “అ..ఆ” విజయానందంలో ఉన్న ఈ భామ నిన్న (సోమవారం) మధురై లోని ఓ బ్యూటీ పార్లర్ ను ప్రారంభించడానికి వెళ్లింది. ఈ వార్తను తెలుసుకున్న తమిళ యువత అక్కడకు చేరుకుంది. సమంతకు తమిళనాడు లోను వీరాభిమానులు ఉన్నారు. అక్కడ ఈ ఏడాది విడుదలైన తేరి, 24 సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. దీంతో తన అభిమాన తారను నేరుగా చూడాలనే ఆశతో యువకులు పెద్ద ఎత్తున పార్లర్ వద్దకు చేరుకున్నారు.
ఆమె కారు రాగానే పరిగెత్తుకెళ్లి ఆ కారు చుట్టూ గుమిగూడారు. ఊహించని పరిస్థితి ఎదురయ్యేసరికి సమంత కంగారు పడి కాసేపు కారులోనే ఉండిపోయారు. కారు దిగలేదని కోపంతో కొంతమంది ఆ కారు టైర్ కు పంచర్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని యువతను చెదర గొట్టడానికి లాఠీ ఛార్జ్ చేశారు. యువకులు దూరంగా వెళ్లడంతో సమంత సెక్యూరిటీ సిబ్బంది రక్షణగా పార్లర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. తిరిగి సురక్షితంగా తన హోటల్ కి వెళ్లారు.