సమ్మోహనం

  • June 15, 2018 / 09:26 AM IST

“అమీ తుమీ” లాంటి డీసెంట్ హిట్ తర్వాత ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “సమ్మోహనం”. సుధీర్ బాబు-అదితిరావు హైదరీ జంటగా నటించిన ఈ చిత్రాన్ని సీనియర్ ప్రొడ్యూసర్ శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించారు. సెన్సిబుల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు అలరించిందో చూద్దాం..!!

కథ:
ఇండస్ట్రీ అన్నా ఇండస్ట్రీలోని హీరోయిన్స్ అన్నా అస్సలు సధభిప్రాయం లేని యువ పుస్తక రచయిత విజయ్ (సుధీర్ బాబు), తన ఇంట్లో షూటింగ్ కోసం వచ్చిన ఒక సక్సెస్ ఫుల్ యంగ్ హీరోయిన్ సమీరా రాథోడ్ (అదితిరావు హైదరీ)కి తొలుత తెలుగు ట్యూటర్ గా జాయిన్ అయ్యి.. అనంతరం ఆమె వ్యక్తిత్వానికి దాసోహమై ఆమెతో ప్రేమలో పడతాడు. అంతా బాగానే సాగుతుంది అనుకొనే టైమ్ లో విజయ్ ప్రపోజల్ ని సమీరా ఒప్పుకోకపోవడంతో మొత్తం కథ రివర్స్ అవుతుంది.

అసలు వీళ్ళద్దరి నడుమ చిగురించిన ప్రేమ పెళ్లి వరకూ వెళ్లడానికి ఇబ్బందికి ఏమిటి? విజయ్ ప్రేమను సమీరా ఎందుకు కాదంది? అందుకు కారణం ఏమిటి? వంటి ప్రశ్నలకు సమాధానంగా ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కించిన చిత్రం “సమ్మోహనం”.

నటీనటుల పనితీరు:
సుధీర్ బాబు కంటే ముందు అదితిరావు హైదరీ గురించి మాట్లాడుకోవాలి. సమీరా రాథోడ్ అనే పరభాషా హీరోయిన్ గా ఆమె నటన, స్వంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం అనేవి పాత్ర ఔన్నిత్యాన్ని పెంపొందించడానికి ఉపయోగపడ్డాయి. ఇండస్ట్రీలో హీరోయిన్లు ఎదుర్కొనే కష్టాలు.. పైకి ఏదో మహా అదృష్టవంతుల్లా కనిపించినా.. లోపల వారు పడే వేదను కేవలం తన కళ్ళతోనే పలికించిన అదితిరావుకి తెలుగులో మంచి భవిష్యత్ ఉందని అర్ధమయ్యేలా చేస్తుంది. సుధీర్ బాబు దగ్గర తెలుగు నేర్చుకొనే సన్నివేశాల్లో మరియు సుధీర్ బాబు ప్రపోజల్ ను కాదనే సన్నివేశాల్లో ఆమె అల్లరి, పరిపక్వత బాగా ఆకట్టుకొంటాయి. ఇక అమ్మడి అందం గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాల్సింది ఏముంటుంది.. మంచు ముత్యంలా ఆమెను తెర మీద చూస్తే ఏ కుర్రాడి మనసైనా తారుమారవ్వాల్సిందే.

సుధీర్ బాబు ఈ చిత్రంతో తన ఆడియన్స్ బేస్ ను పెంచుకోగలిగాడు. ఎమోషన్స్ సీన్స్ లో సుధీర్ పలికించిన హావభావాలు నటుడిగా బాబు ఇంప్రూవ్ అయ్యాడని అర్ధమయ్యేలా చేస్తే.. తండ్రితో సినిమాల గురించి, స్నేహితులతో సినిమా ఆర్టిస్టుల గురించి మాట్లాడే సన్నివేశాల్లో మెచ్యూరిటీ ప్రదర్శించాడు.

రాహుల్ రామకృష్ణ ఓ మోస్తరుగా పర్వాలేదు అనిపించుకోగా.. తనికెళ్లభరణి పాత్ర ఆకట్టుకొంది. సీనియర్ నరేష్ పాత్ర ఆడియన్స్ ను కడుపుబ్బ నవ్విస్తుంది కానీ.. సెకండాఫ్ లో ఓవర్ యాక్షన్ కాస్త ఎక్కువైందనిపిస్తుంది. మిగతా పాత్రధారులందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు:
పి.జి.విందా సినిమాటోగ్రఫీ & లైటింగ్ సినిమాకి మంచి వేల్యూ యాడ్ చేసింది. హీరోహీరోయిన్ల నడుమ సన్నివేశాలను చాలా పోయిటిక్ గా పెయింటింగ్ లా చిత్రీకరించాడు. అందానికి నిర్వచనంలా ఉండే అదితిరావు హైదరీని మరింత అందంగా చూపించడం, పాటల్ని హృదయానికి హత్తుకొనేలా తెరకెక్కించడం, ఓపెనింగ్ షాట్స్ లో లైటింగ్ పరంగా తీసుకొన్న జాగ్రత్తలు వంటివి విందా పనితనానికి ప్రతీకలుగా నిలుస్తాయి. మినిమమ్ బడ్జెట్ లో హైక్వాలిటీ అవుట్ పుట్ ఇచ్చే విందా లాంటి టెక్నీషియన్స్ అవసరం ఇండస్ట్రీకి చాలా ఉంది.

“మెంటల్ మదిలో” తర్వాత వివేక్ సాగర్ మరోమారు తన సంగీతంతో, బ్యాగ్రౌండ్ స్కోర్ తో మాయ చేశాడు. లవ్ స్టోరీస్ అనగానే హార్మోనీలకు, సింఫనీలకు పని చెప్పే మన బిజీ మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ వివేక్ సాగర్ ను చూసి చాలా నేర్చుకోవాలి. ప్రతి సన్నివేశంలోనూ హీరోహీరోయిన్ల మనసులోని భావాలు వాళ్ళ కళ్ళల్లో ప్రకటితమైనప్పుడు ఆ భావాన్ని తన సంగీతంతో ప్రేక్షకుల హృదయాల్లోకి జొప్పింపజేశాడు వివేక్ సాగర్.

దర్శకుడు ఇంద్రగంటికి తెలుగు భాష, తెలుగుదనం మీద ఉన్న అభిమానం ప్రేమ వల్ల సినిమాలోని ప్రతి ఫ్రేమ్ లోనూ తెలుగుతనం, సహజత్వం పరిమళిస్తుంది. “ఒక మంచి తెలుగు సినిమా చూశాం” అనే భావన ప్రతి తెలుగు ప్రేక్షకుడికి కలిగేలా సినిమాను తెరకెక్కించిన విధానం ప్రశంసనీయం. ఆయన రాసుకొనే సంభాషణాల్లో ఉండే తెలుగుదనం, సన్నివేశాల్లో నేటివిటీ అమితంగా ఆకట్టుకొంటాయి. ఇక ప్రతి నటుడి నుంచి ఇంద్రగంటి రాబట్టుకొనే చక్కని నటన ప్రేక్షకుడ్ని ప్రతి పాత్రలో లీనమయ్యేలా చేస్తుంది. ఆయన సంభాషణల విషయంలోనే కాక సాహిత్యపరంగానూ తీసుకొనే జాగ్రత్తలు మనసుకి సాంత్వన చేకూరుస్తాయి. ఇక చాలా చిన్న చిన్న భావాలతో బోలెడన్ని అర్ధాలు పలికించే, వ్యక్తపరిచేలా ఆయన రాసుకొనే సన్నివేశాలు ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయి. సినిమాలో హీరోహీరోయిన్ల నడుమ భీభత్సమైన రొమాన్స్ ఉండదు, కానీ.. సినిమా చూస్తున్న ప్రతి ఒక్కరూ వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీని ఫీల్ అవుతారు, వాళ్ళ ప్రేమకథలో ప్రేక్షకుల్ని ఇన్వాల్వ్ చేసి.. వాళ్లెప్పుడు, ఎలా కలుస్తారా అని ప్రేక్షకుల్లో ఉత్సుకత పెంచడానికి ఆయన ప్రయత్నించే విధానం “సమ్మోహనం” సినిమాకి ప్రత్యేక మరియు ప్రధాన ఆకర్షణ. సెకండాఫ్ లో హీరోహీరోయిన్ల నడుమ కాన్ఫిల్క్ట్ పాయింట్ ను ఎస్టాబ్లిష్ చేయడానికి, మళ్ళీ ఆ గొడవ సద్దుమణిగేలా చేయడానికి కాస్త ఎక్కువ టైమ్ తీసుకొన్నాడు తప్పితే.. ఒక దర్శకుడిగా, రచయితగా మంచి విజయాన్ని అందుకొన్నాడనే చెప్పాలి.

అన్నిటికంటే ముఖ్యంగా.. అదితిరావ్ హైదరీ పాత్ర, వ్యవహారశైలి ద్వారా హీరోయిన్స్ అంటే బయట ప్రపంచంలో ఉన్న హీనమైన దృష్టి కోణాన్ని మార్చే ప్రయత్నం మాత్రం హర్షణీయం. ఒక్క హీరోయిన్ అనే కాదు.. ఇండస్ట్రీ మీద ఉన్న చులకన భావం కూడా తనదైన శైలిలో పారద్రోలడానికి ప్రయత్నించిన ఇంద్రగంటి
. సెకండాఫ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఉంటే సినిమా రిజల్ట్ ఇంకాస్త బెటర్ గా ఉండేది.
అయితే.. మల్టీప్లెక్స్ & ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం సినిమాకి బాగా కనెక్ట్ అవ్వడంతోపాటు.. ఎంజాయ్ చేస్తారు కూడా.

విశ్లేషణ:
“సమ్మోహనం” అన్నీ వర్గాల ప్రేక్షకుల్ని సమ్మోహన పరచకపోయినా.. ఎక్కువశాతం ప్రేక్షకుల్ని సినిమాలో లీనమయ్యేలా చేస్తుంది. ఎలాంటి అసభ్యత, అశ్లీలతలకు తావులేకుండా.. డబుల్ మీనింగ్ డైలాగులకు స్థానం లేకుండా కుటుంబంలోని ప్రతి ఒక్కర్నీ ఆకట్టుకొనే విధంగా ఉన్న ఈ చిత్రాన్ని తప్పకుండా ఒకసారి చూడాల్సిందే.

రేటింగ్: 2.5/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus