కన్నడలో సూపర్ అయిన ‘లవ్ మాక్ టైల్’ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనుకున్నారు. ‘గుర్తుందా శీతాకాలం’ అనే టైటిల్ తో తెలుగులో ఈ సినిమాను రీమేక్ చేస్తున్నట్లు మేకర్లు ప్రకటించారు. మిల్కీ బ్యూటీ తమన్నా, యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ ప్రధాన పాత్రల్లో.. దర్శకుడు నాగశేఖర్ ఈ సినిమాను రూపొందించనున్నట్లు అనౌన్స్ చేశారు. ఆయనే నిర్మాత కూడా. కాల భైరవ సంగీత దర్శకుడు. సెప్టెంబర్ నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ ఉంటుందని అప్పట్లో ప్రకటించారు. అయితే ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండి రకరకాల రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి.
ఈ సినిమా కోసం మొదట తక్కువ రెమ్యునరేషన్ మాట్లాడుకున్న సత్యదేవ్ ఆ తరువాత రెమ్యునరేషన్ పెంచేశాడని అన్నారు. మహేష్ కోనేరు నిర్మాతగా వ్యవహరిస్తోన్న ‘తిమ్మరుసు’ సినిమాకి కోటి రూపాయలు రెమ్యునరేషన్ ఇస్తున్నారని.. అంతే మొత్తాన్ని ‘గుర్తుందా శీతాకాలం’ సినిమా విషయంలో కూడా డిమాండ్ చేశారనే వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో కానీ.. ఇప్పుడైతే ఈ సినిమా ఆగిపోయిందనే విషయం హాట్ టాపిక్ గా మారింది. కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేశారని అంటున్నారు.
అయితే ఈ విషయంపై చిత్రబృందం నుండి ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. ఈ సినిమా ఆగిపోయినందునే నటుడు సత్యదేవ్ ‘తిమ్మరుసు’ సినిమాను ప్రారంభించారని టాక్. తాజాగా ఈ విషయంపై స్పందించిన సత్యదేవ్ సినిమా ఆగిపోలేదని, త్వరలోనే షెడ్యూల్ మొదలుపెట్టడానికి సిద్ధమవుతున్నామని అంటున్నాడు. కానీ ఈ విషయంలో దర్శకుడు కమ్ నిర్మాత నాగశేఖర్ మాత్రం మౌనం వహిస్తున్నారు.