ఓటు హక్కు వినియోగించుకోని వారు ప్రశ్నించే హక్కు కోల్పోయినట్లేనని బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ తెలిపారు. తమిళనాట ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన పై విధంగా స్పందించాడు. చెన్నై, పెరంబదూర్ లోని హ్యుందయ్ ప్లాంట్ నెలకొల్పి 20 సంవత్సరాలుపూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన ఓ ప్రముఖ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. ‘ మీరు ఓటు హక్కును వినియోగించుకోకపోతే ప్రశ్నించే హక్కును కోల్పోయినట్లే. మీకు నచ్చిన నేతను ఎన్నుకోండి. వారు సరిగా పనిచేయక పోతే సామాజిక మాధ్యమాల ద్వారా వారిని ప్రశ్నించండి. మీరు ప్రశ్నించపోతే మీరు గుర్తింపు కోల్పోయినట్లే’అన్నారు. అంతేకాకుండా దేశంలో 35 సంవత్సరాల లోపు యువత 60 శాతం మంది ఉన్నారని, వారు తమ గొంతుకను వినిపించాలని ఆయన అన్నారు. కాగా ప్రస్తుతం ఆయన రాయీస్ చిత్రంలో నటిస్తున్నాడు.