Shanmukha Review in Telugu: షణ్ముఖ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • ఆది సాయికుమార్ (Hero)
  • అవికా గోర్ (Heroine)
  • ఆదిత్య ఓం,చిరాగ్ జాని,మాస్టర్ మను సప్పని,అరియానా గ్లోరీ,మీనా వాసు,జబర్దస్త్ దొరబాబు (Cast)
  • ష‌ణ్ముగం సాప్ప‌ని (Director)
  • తుల‌సీరామ్ సాప్ప‌ని, ష‌ణ్ముగం సాప్ప‌ని (Producer)
  • రవి బస్రూర్ (Music)
  • ఆర్.ఆర్. విష్ణు (Cinematography)
  • Release Date : మార్చి 21, 2025

ఆది సాయికుమార్ (Aadi Saikumar)  నటించగా ఓ చెప్పుకోదగ్గ సినిమా వచ్చి దాదాపు అయిదేళ్లు అవుతోంది. సరిగా ఆడకపోయినా అది సాయికుమార్ నటించిన ఆఖరి మంచి సినిమా “జోడీ” (Jodi). ఆ తర్వాత వచ్చినవన్నీ కనీస స్థాయిలో ఆకట్టుకోలేక రెండు రోజుల్లో థియేటర్ల నుండి తొలగించబడిన సినిమాలే. ఈసారి కాస్త డివోషనల్ యాంగిల్ ను టచ్ చేస్తూ “షణ్ముఖ” (Shanmukha) అనే చిత్రంలో నటించాడు ఆది. రవి బస్రూర్ (Ravi Basrur) సంగీతం అందించడం కాస్త షాక్ ఇవ్వగా.. ట్రైలర్ ఓకే అనిపించింది. మరి సినిమా ఎలా ఉంది? ఆది సాయికుమార్ హిట్ కొట్టాడా? అనేది చూద్దాం..!!

Shanmukha Review

కథ: హైదరాబాద్ లో సరిగ్గా వర్షాకాలంలో అమ్మాయిలు మిస్ అవుతూ ఉంటారు. ఈ కేస్ పై ఇన్వెస్టిగేట్ చేస్తుంది జర్నలిస్ట్ సారా (అవికా గోర్) (Avika Gor). ఆమెకు సహాయపడేందుకు ఎస్సై కార్తీక్ (ఆది సాయికుమార్) రంగంలోకి దిగుతాడు. కలిసి ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టాక.. అమ్మాయిలు మిస్ అవ్వడానికి, తాంత్రిక శక్తులకు సంబంధం ఉందని తెలుస్తుంది. అసలు ఈ అమ్మాయిలు ఎలా మిస్ అవుతున్నారు? ఈ తాంత్రిక శక్తి ఏమిటి? ఈ రహస్యాన్ని కార్తీక్ ఎలా ఛేదించాడు? అనేది “షణ్ముఖ”(Shanmukha) కథాంశం.

నటీనటుల పనితీరు: సినిమా అవుట్ పుట్ తో సంబంధం లేకుండా తనదైన నటనతో, స్క్రీన్ ప్రెజన్స్ తో 100% న్యాయం చేయడానికి ప్రయత్నించే నటుడు ఆది సాయికుమార్. ఈ చిత్రంలోనూ టెక్నికాలిటీస్ సరైన విధంగా సహకరించకపోయినా.. ఆఖరికి క్లైమాక్స్ లో సరైన విగ్ లేకపోయినా కూడా నటుడిగా మాత్రం మంచి మార్కులు సంపాదించుకున్నాడు.

అవికా గోర్ చిన్నప్పుడే మంచి నటనతో ఆకట్టుకునేది. చదువుకోక ముందు కాకరకాయ చదువుకున్న తర్వాత కీకరకాయ అన్నట్లు.. సినిమా సినిమాకి ఆమెలోని నటి మందగిస్తోంది. కనీస స్థాయిలో కూడా అలరించలేకపోయింది. చిరాగ్ నాని స్క్రీన్ ప్రెజన్స్ బాగున్నా.. ఒక్క డైలాగ్ కి కూడా లిప్ సింక్ కుదరకపోవడంతో అతడి పాత్ర కూడా పండలేదు.

సినిమాలో చాలామంది నటులు ఉన్నప్పటికీ.. డైరెక్టర్ స్వయంగా పోషించిన బుల్లెట్ బాబు పాత్ర హిలేరియస్ గా పేలింది. అలాగని బాగా నటించాడని కాదు, ఇదేం పాత్రరా బాబు అని అందరూ నవ్వుకునేలా. షార్ప్ షూటర్ అయ్యుండి కారు సన్ రూఫ్ నుండి నిల్చుని షూట్ చేయడానికి ప్రయత్నించడం అనేది అత్యంత హాస్యాస్పదం. ఇక మిగతా నటీనటుల గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు.

సాంకేతికవర్గం పనితీరు: సినిమాకి వర్క్ చేసిన టెక్నీషియన్స్ లో రోటో టీమ్ & సీజీ టీం ను మెచ్చుకోవాలి. అంత తక్కువ బడ్జెట్ లో మంచి అవుట్ పుట్ ఇచ్చారు. రవి బస్రూర్ నేపథ్య సంగీతం పెద్దగా వర్కవుట్ అవ్వలేదు. క్లైమాక్స్ సాంగ్ బాగున్నప్పటికీ.. ఆ పాటను సరిగా పిక్చరైజ్ చేయకుండా AI వీడియోలతో ఫీల్ చేయడం అనేది సినిమాకి ఏమాత్రం హెల్ప్ అవ్వలేదు.

సినిమాటోగ్రఫీ వర్క్ డీసెంట్ గా ఉంది. సినిమాలో దొర్లిన తప్పులన్నీ దర్శకుడివే అని చెప్పొచ్చు. పాయింట్ ఆసక్తికరంగా ఉన్నా.. కథనంలో పట్టు లేకపోవడంలో, సన్నివేశాల్లో సరైన స్థాయి ఎమోషన్ పండకపోవడంతో “షణ్ముఖ” ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో విఫలమైంది. దర్శకుడిగా షన్ను కూడా విఫలమయ్యాడు.

విశ్లేషణ: మూలకథ బాగుండి, ఆచరణ సరైన విధంగా లేక ఫెయిలైన సినిమాలు థియేటర్లలో కాకపోయినా కనీసం ఓటీటీల్లో లేదా టీవీల్లో చూసి పర్లేదు అనుకుంటాం. కానీ.. ఎగ్జిక్యూషన్ యొక్క ప్రతి అంశంలో విఫలమై ప్రేక్షకులను అలరించలేక చతికిలపడిన సినిమా “షణ్ముఖ”. ఆది సాయికుమార్ కష్టానికి తగ్గ ఫలితం లభించలేదు.

ఫోకస్ పాయింట్: ఆడియన్స్ ను బెంబేలెత్తించిన బుల్లెట్ బాబ!

రేటింగ్: 1.5/5

Rating

1.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus