రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘శేఖర్’. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘జోసెఫ్’ మూవీకి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కింది. రాజశేఖర్ భార్య జీవిత రాజశేఖర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం జరిగింది. అంతేకాదు రాజశేఖర్ కూతురు శివాని ఈ మూవీలో కీలక పాత్ర పోషించడం అలాగే శివాత్మిక, శివాని లు నిర్మాతలుగా కూడా వ్యవహరించడంతో ఇది జీవిత రాజశేఖర్ల ‘మనం’ అన్నట్టు ప్రమోషన్ జరిగింది. మరి ఈ మూవీ ప్రేక్షకులను ఏ మేరకు అలరించింది అనే విషయం పై ఓ లుక్కేద్దాం రండి :
కథ : శేఖర్ (రాజశేఖర్) ఓ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్. వయసు మీద పడినప్పటికీ ఇతను క్రైం ఇన్వెస్టిగేషన్ చేయడంలో నేరస్థులను తక్కువ టైంలో కనిపెట్టడంలో ఎక్స్పర్ట్. అందుకే ఇతని ట్యాలెంట్ ను , అనుభవాన్ని పోలీసులు ఇతను రిటైర్ అయ్యాక కూడా వాడుకుంటూ ఉంటారు. అయితే రాజశేఖర్ తన మాజీ నుండీ విడిపోయి సెపరేట్ గా జీవిస్తూ ఉంటాడు. ఓసారి ఇతని మాజీ భార్య రోడ్డు యాక్సిడెంట్‌లో చనిపోతుంది. కానీ ‘శేఖర్’ ఇన్వెస్టిగేషన్లో అది హత్య అని తేలుతుంది. ఆమెను హత్య చేసింది ఎవరు? అసలు తన భార్యతో శేఖర్ ఎందుకు వినిపోయాడు? ఆ నేరస్థులను శేఖర్ ఎలా పట్టుకున్నాడు? చివరికి అతని జీవితం ఏమైంది అనేది మిగిలిన కథ.
నటీనటుల పనితీరు : రాజశేఖర్ ఈ చిత్రం కోసం ప్రాణం పెట్టి పని చేసినట్టు ప్రీ రిలీజ్ ఈవెంట్లో అతని కుటుంబ సభ్యులు చెప్పుకొచ్చారు. అది వందకు వంద శాతం నిజం. ‘శేఖర్’ లో అతని లుక్స్ కూడా అందరినీ ఆకట్టుకుంటాయి. కొన్ని సన్నివేశాల్లో అయితే అజిత్ లా స్టైలిష్ గా అనిపించారు రాజశేఖర్.ఇక ఆత్మీయ రాజన్, శివాని లవి అతిథి పాత్రల్లా అనిపిస్తాయి కానీ ఓకె అన్నట్టు ఉంటాయి.
మిగిలిన నటీనటులు అయిన సమీర్, ప్రకాష్ రాజ్,సమీర్, భరణి శంకర్, రవి వర్మ, శ్రవణ్ రాఘవేంద్ర, కన్నడ కిషోర్ వంటి వారు తమ తమ పాత్రలకి న్యాయం చేశారు. ఎంతమంది ఉన్నా రాజశేఖర్ నటన అందరినీ డామినేట్ చేసేసి వన్ మ్యాన్ షో చేశాడు అనే ఫీలింగ్ కలిగిస్తుంది.
సాంకేతిక నిపుణుల పనితీరు : సస్పెన్స్ థ్రిల్లర్స్ కు గ్రిప్పింగ్ నెరేషన్ ఉండాలి. కథ ఎంత మంచిదైనా గ్రిప్పింగ్ నెరేషన్ లేకపోతే ట్రాక్ తప్పినట్టు అవుతుంది. ‘శేఖర్’ విషయంలో కూడా అలా ట్రాక్ తప్పిన ఫీలింగ్ కలిగిస్తుంది.ఒరిజినల్ ను యధాతధంగా దింపేసినా బాగానే ఉండేదేమో.కానీ ఓపెనింగ్ సీన్లు బాగా రాసుకుని తర్వాత కథనాన్ని గాలికి వదిలేసిన ఫీలింగ్ కలిగిస్తుంది. డైరెక్టర్ మారడం వలనో ఏమో కానీ.. ఆ కనెక్టివిటీ లోపం బిగ్ స్క్రీన్ పై క్లియర్ గా కనిపించింది.
‘జోసెఫ్’ లో గ్రిప్పింగ్ నెరేషన్ తో పాటు ఎమోషన్ కు కూడా అక్కడి జనాలు కనెక్ట్ అయ్యారు. తెలుగులో మాత్రం ఎమోషన్ కు కనెక్ట్ అవ్వరు. ఆ ట్రాక్ లు లేకుంటే బాగుణ్ణు అనే ఫీలింగ్ కలుగుతుంది. జీవిత రాజశేఖర్ డైరెక్షన్లో చాలా లోపాలు కనిపించాయి. ఇప్పటి ట్రెండ్ కు తగ్గ దర్శకులు ఎవరైనా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసుంటే కథనం బాగుండేదేమో.
అయితే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో అనూప్ రూబెన్స్ మంచి ఔట్పుట్ ఇచ్చాడు.సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ కు కూడా ఇతను పర్ఫెక్ట్ అని ‘దృశ్యం2’ తర్వాత ఈ మూవీతో మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. మల్లికార్జున్ నరగని సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. నిర్మాణ విలువలు కథకి తగ్గట్టు ఉన్నాయి.
విశ్లేషణ : మలయాళం ‘జోసెఫ్’ చూసేసిన వాళ్ళకి.. ‘శేఖర్’ బోరు కొట్టిస్తుంది. ఒరిజినల్ చూడని వాళ్ళకి ఇంట్రెస్టింగ్ గా ఉంటుందా అంటే కచ్చితంగా అవునని చెప్పలేము. కథనం వీక్ గా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ పర్వాలేదు అనిపించినా సెకండ్ హాఫ్ తేలిపోయినట్టు ఉంటుంది. అయితే రాజశేఖర్ కోసం.. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారు తక్కువ ఎక్స్పెక్టేషన్స్ తో ‘శేఖర్’ మూవీకి వెళ్తే సంతృప్తి చెందొచ్చేమో.
రేటింగ్ :2/5