అక్కినేని ప్రిన్స్ అఖిల్, ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్ శ్రియా భూపాల్ లు ప్రేమించుకొని.. పెద్దలను ఒప్పించి ఘనంగా నిశ్చితార్ధం కూడా చేసుకున్నారు. కానీ వారం రోజుల్లో పెళ్లి అనగా క్యాన్సిల్ అయింది. ఇద్దరూ గొడవపడ్డారని, పెళ్లి రద్దయిందని కొంతకాలంగా మీడియాలో రూమర్లు తప్పించి.. ఇరు కుటుంబాల వారు దీనిపై స్పందించలేదు. అయితే తాజాగా శ్రీయా భూపాల్, అపోలో హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాప్ సి.రెడ్డి మనవడు అనిందిత్ రెడ్డి ని వివాహం చేసుకుంది. నిన్న (జులై 6 న) వీరి వివాహం హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్లో అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లికి ముందు ఏర్పాటు చేసిన సంగీత్ ఫంక్షన్ లో పలువురు స్టార్స్ సందడి చేశారు.
ఈ వేడుకలో రామ్ చరణ్, ఉపాసనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అనిందిత్ రెడ్డి .. ఉపాసనకు కజిన్ అవుతారని సమాచారం. విరాట్ కోహ్లీ , నాగ చైతన్య పెళ్లి వేడుకలకు ఫోటోగ్రాఫర్ గా పనిచేసిన ప్రముఖ ఫోటోగ్రాఫర్ జోసెఫ్ రాధిక్.. శ్రియా, అనిందిత్ వివాహ వేడుకకు ఫొటోగ్రాఫర్‌గా పనిచేయడం విశేషం. అతనే తన ఇన్స్టాగ్రామ్ ద్వారా శ్రియా, అనిందిత్ వివాహానికి సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు.పెళ్లి దుస్తుల్లో శ్రియా మెరిసిపోయారు. ఆమె మెడలో డైమండ్ నెక్లెస్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, సంప్రదాయ దుస్తుల్లో అనిందిత్ అందంగా కనిపించారు. ఈ పెళ్లితో అఖిల్, శ్రీయా మధ్య బంధం పూర్తిగా తెగిపోయినట్లు స్పష్టమయింది.