తెలుగు సినీ పరిశ్రమ మీద ఇష్టంతో వెండి తెరపై అడుగు పెట్టిన ముద్దుగుమ్మ శ్రియ. అగ్ర హీరోలతో నటించి విజయాలను సొంతం చేసుకుంది. పదిహేనేళ్లుగా టాలీవుడ్ లో సినిమాలు చేస్తున్నా.. తెలుగును నేర్చుకోలేదు. ఒక్క సినిమాకు కూడా సొంతంగా డబ్బింగ్ చెప్పుకోలేదు. ఇప్పుడు మన భాషను నేర్చుకునేందుకు ఆరాటం పడుతోంది. ఇదివరకు లేని ఆ అభిమానం ఇప్పుడు ఎలా వచ్చిందబ్బా అని ఆరా తీస్తే… అసలు విషయం బయట పడింది.
నటసింహ బాలకృష్ణ ప్రతిష్టాత్మక చిత్రం “గౌతమి పుత్ర శాతకర్ణి” లో అవకాశం రావడమే ఆమెలోని మార్పునకు కారణం అని తెలిసింది. బాలయ్య వందో చిత్రంలో శ్రియ రాణి పాత్రలో కనిపించనుంది. ఆ పాత్రకు తగిన న్యాయం చేసేందుకు, చక్కగా అభినయించేందుకు ట్యూటర్ ని పెట్టుకుని తెలుగును నేర్చుకుంటోంది. జాతీయ అవార్డు గ్రహీత క్రిష్ ఈ చిత్రాన్ని నందమూరి అభిమానుల అంచనాలకు తగ్గకుండా తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు. మూడో షెడ్యూల్ జరుపుకుంటున్నఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. నాలుగో షెడ్యూల్ చిత్రీకరణలో శ్రియ పాల్గొననున్నట్లు సమాచారం.