స్టార్ హీరో కమల్ హాసన్ కూతురు శృతిహాసన్.. తండ్రి వారసత్వంలో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. తన టాలెంట్ తో అవకాశాలు అందుకొని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అయితే కొన్ని కారణాల వలన ఆమె మూడేళ్లుగా సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు. తాజాగా ‘క్రాక్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘క్రాక్’ సినిమాలో తాను పోషించిన కళ్యాణి పాత్ర ప్రతీ ఒక్కరికీ కనెక్ట్ అవుతుందని.. విమర్శకుల నుండి ప్రశంసలు అందుకోవడం సంతోషంగా ఉందని అన్నారు.
కెరీర్ పరంగా మొదటి నుండి కూడా తాను ప్రయోగాలకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ‘క్రాక్’ సినిమాలో తల్లి పాత్ర చేయాలా..? వద్దా..? అనే సందేహం తనకు రాలేదని అన్నారు. స్టార్ హీరోయిన్లు తల్లి, భార్య పాత్రలు చేయకూడదనే ఆలోచనలను ఏనాడో కాలం చెల్లిందన్నారు. వెండితెరపై తల్లి పాత్రలో కనిపించినంత మాత్రాన కెరీర్‌కు వచ్చిన ముప్పేమీ లేదన్నారు. ఇక మూడేళ్లపాటు సినిమాలకు దూరం కావడంపై తరచూ తనకు ప్రశ్నలు ఎదురవుతున్నాయని.. ఈ గ్యాప్ కావాలని తీసుకున్నదే తప్ప.. అవకాశాలు లేక మాత్రం కాదన్నారు.
తనను తాను సరికొత్తగా, సృజనాత్మకంగా ఆవిష్కరించుకోవడానికి ఈ మూడేళ్లు పనికొచ్చాయని చెప్పారు. ఏ రంగంలోనైనా ప్రతీ ఒక్కరికీ ఇలాంటి విరామం అవసరమని అన్నారు. సంగీతంపై దృష్టి పెట్టాలనే ఆలోచనతో సినిమాలకు గ్యాప్ ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు. ఇలా మూడేళ్లు గ్యాప్ తీసుకోవడం తన జీవితంలో తీసుకున్న బెస్ట్ డెసిషన్స్ లో ఒకటని వెల్లడించారు.