పవన్ కళ్యాణ్ కాటమరాయుడు సినిమా తర్వాత శృతి హాసన్ తెలుగులో ఏ సినిమా అంగీకరించలేదు. తమిళ భారీ చిత్రం సంఘమిత్ర కోసం విదేశాల్లో శిక్షణ అందుకున్నప్పటికీ ఆ సినిమా నుంచి తప్పుకుంది. మరి ఏడాదిగా ఖాళీగా ఉన్న ఈ భామ ఏమి చేస్తోందని ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. దొరికిన సమయాన్ని తన బాయ్ ఫ్రెండ్ మైఖేల్ కోర్సేల్ తో గడపడానికి వినియోగించుకుంది. లండన్‌కి చెందిన నటుడు మైఖేల్ కోర్సేల్‌తో కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్టు, ముంబయి లో కాపురం పెట్టినట్టు కొంతకాలంగా మీడియా గగ్గోలు పెట్టింది. వాటిని తిప్పి కొట్టిన శృతి హాసన్ రీసెంట్ గా ఓ ఫొటోతో దొరికిపోయింది.
ఆ ఫొటోలో మైఖేల్, శ్రుతి హాసన్ తో పాటు శృతి తల్లి సారిక ఉండడం విశేషం. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. పెళ్ళికి తల్లిని ఒప్పించడానికి శృతికి ఇంత సమయం పట్టినట్టు ముంబై వర్గాలు తెలిపాయి. ఇక తండ్రి కమల్ హాసన్ వైపు నుంచి ఎటువంటి అభ్యంతరం లేకపోవడంతో శృతి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కడం ఖాయమని మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. శృతి హాసన్ శెభాష్ నాయుడు సినిమా మినహా ఏ చిత్రానికి సంతకం చేయకపోవడంతో వివాహం జరుగుతుందని సినీ వర్గాలు ఫిక్స్ అయిపోయాయి. ఇక ఈ వార్తలపై శృతి ఏమంటుందో చూడాలి.