తెలుగు సినిమా ప్రస్తుతం నడుస్తున్న జమానా అయితే జెన్‌జీ కథ.. లేదంటే పీరియాడిక్ సినిమాలు. టాలీవుడ్‌లో హిట్ సినిమాల ఫార్మాట్ ఇదే అనే ఓ లెక్క రాసేసుకున్నారు. లేదంటే పాత సినిమాలను మరపించేలా కొన్ని సీన్స్/ రిఫరెన్స్‌లను ఇప్పటి సినిమాలో పెట్టాలి. ఇలా కాకుండా మధ్యలో కథ రాసుకున్నా, మరీ పాత స్టైల్ కథలు తీసినా ప్రేక్షకులు ఆదరించడం లేదు. ఇలాంటి సమయంలో పీరియాడిక్ టైమ్‌లో అనుకున్న కథను.. ఇప్పుడు తెరకెక్కించారు. ఆ సినిమానే ‘సింగ్ గీతం’.
లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సింగ్ గీతం’. ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ అయిన సింగీతం శ్రీనివాసరావు 94 ఏళ్ల వయసులో ఈ సినిమా డైరెక్షన్ చేయడం విశేషం. జూన్ 11న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ క్రమంలో ప్రముఖ కమల్ హాసన్ చెప్పిన కొన్ని విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అందులో ఒకటి ‘సింగ్ గీతం’ కథ గురించి చెప్పిన విషయం.
సింగీతం శ్రీనివాసరావుకు సినిమాపై ప్రేమ ఎక్కువ. నా 21 ఏళ్ల వయసులో ఆయనతో జర్నీ స్టార్ట్ అయింది. మా తొలి సినిమా తర్వాత రెండు కథలు చెప్పారు. వాటిలో ఒకటి ‘పుష్పక విమానం’. ఆ రెండో కథ గురించి అప్పటి నుండి ఇప్పటివరకు అంటే 45 ఏళ్లుగా మాట్లాడుకుంటున్నాం. ఇప్పటివరకు చేయలేకపోయాం. అదే ఈ ‘సింగ్ గీతం’ అని చెప్పారు కమల్. అంటే అప్పుడెప్పుడో నాలుగున్నర దశాబ్దాల క్రితం అనుకున్న కథతో ఇప్పుడు సినిమా తీశారన్నమాట.
మరి అంత పాత కథ ఇప్పుడు విజయం సాధిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ప్రస్తుతం సమాజంలో ఉన్న అంశాల్ని ఎప్పుడో ఊహించేసిన ఘనడు సింగీతం. అందుకే 45 ఏళ్ల క్రితం ‘పుష్పక విమానం’ లాంటి మూకీ సినిమా వచ్చింది.