సిల్వర్ స్క్రీన్ పైకి శ్రీదేవి తనయ

  • October 4, 2016 / 07:31 AM IST

శ్రీదేవి- ఒకప్పటి వెండితెర సామ్రాజ్ఞి. ఇప్పటికీ ఆమె పేరు వినపడగానే ఆ సౌందర్య రూపం కళ్ళముందు కదలాడుతుంటుంది. అతిలోకసుందరిగా దక్షిణాది ప్రేక్షక లోకాన్ని అలరించిన ఈ అందాల తార అటుపై ఉత్తరాదిన అడుగుపెట్టి మెట్టినిల్లుగా మార్చుకుంది. సౌత్ తో పాటు బాలీవుడ్ లోను కొడుకు కూతురు అన్న తారతమ్యం లేకుండా స్టార్ వారసులంతా తమ తల్లిదండ్రుల వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని అదే రంగంలో రాణిస్తున్నారు. ఇదే విషయాన్ని శ్రీదేవి వద్ద ఎన్నోసార్లు ప్రస్తావిస్తే ఆమె దాటవేసే సమాధానాలు చెబుతూ తప్పించుకున్నారు.

శ్రీదేవి కుమార్తె జాహ్నవి సినీ అరంగేట్రంపై కొంతకాలంగా చర్చ సాగుతోన్న సంగతి తెలిసిందే. తను చిన్న పిల్ల అని శ్రీదేవి చెంగు అడ్డు వేస్తున్నా దర్శక నిర్మాతలు జాహ్నవిపై ఓ కన్నేయడం మానలేదు. బాలీవుడ్ వారు కూడా అందగాడంటూ మురిసిపోయే మహేశ్ సినిమాలో జాహ్నవి ఎంట్రీ అనుకున్నా అవన్నీ పుకార్లుగానే మిగిలాయి. అయితే బాలీవడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ చేతిలో జాహ్నవిని పెట్టారట ఆమె తల్లిదండ్రులు. వారసులను పరిచయం చేయడంలో జోహార్ స్పెషలిస్ట్ అన్న సంగతి తెలిసిందే. ఆ కారణం చేతనే అతడు నిర్మించబోయే ‘శిద్దత్’ సినిమాతో జాహ్నవిని హీరోయిన్ గా చేయాలని నిర్ణయించుకున్నారట.

వరుణ్ ధావన్ హీరోగా నటించనున్న ఈ సినిమాకి తొలుత అలియా భట్ పేరు వినిపించిన సంగతి తెలిసిందే. జాహ్నవి పేరు ఇప్పుడు తెరమీదికి రావడానికి కారణం అనిల్ కపూర్ తనయుడు హర్షవర్ధన్ కుమార్ నటించిన ‘మీర్జ్యా’ ప్రీమియర్ షోకి జాహ్నవి హాజరు కావడమే. అక్కడ జాహ్నవి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిందట. దాంతో ఈ విషయాలన్నీ బయటికొచ్చాయి. అదీ అసలు సంగతి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus