సినీ పరిశ్రమలో విషాదాల సంఖ్య పెరుగుతూనే ఉంది. మొన్ననే కోలీవుడ్ సంగీత దర్శకుడు రఘురామ్ కామెర్లతో బాధపడుతూ మరణించాడు. ఆ షాక్ నుండి సినీ పరిశ్రమ ఇంకా కోలుకోకుండానే మరో నటి మరణించడంతో ఇండస్ట్రీకి షాక్ తగిలినట్టయ్యింది.వివరాల్లోకి వెళితే.. ప్రముఖ బెంగాలీ నటి సోనాలి చక్రవర్తి తాజాగా కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వస్తున్న ఆమె కోల్కతాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో సోమవారం నాడు ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించింది.
తెల్లవారుజామున ఆమెకు గుండెపోటు కూడా రావడంతో మరణించినట్టు స్పష్టమవుతుంది. దీంతో ఆమె కుటుంబంలో విషాద ఛాయలు అల్లుకున్నాయి. ఆమె వయసు 59 సంవత్సరాలు కావడం గమనార్హం. సోనాలి మరణవార్త బయటకు రాగానే బెంగాల్ సినీ పరిశ్రమ శోక సంద్రంలో మునిగి పోయినట్లు అయ్యింది. సోనాలి అంత్యక్రియలు అక్టోబర్ 31న నిర్వహించబోతున్నారు. కోల్కతాలోని కియోరటోలా శ్మశాన వాటికలో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి.
పలు సినిమాలు, సీరియల్స్ ద్వారా మంచి పేరు సంపాదించుకున్న సొనాలి తక్కువ టైంలోనే పాపులర్ అయ్యింది. ‘హర్ జీత్’ చిత్రంలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. 2004లో వచ్చిన బంధన్ సినిమాలో కూడా ఆమె ముఖ్య పాత్ర పోషించింది. ఆమె ఆరోగ్యం బాగోలేని కారణంగా సినిమాలకు, సీరియల్స్ కు దూరంగా ఉంటూ వస్తోంది. ఓ టీవీ షోలో పాల్గొన్నప్పుడు ఆమె భర్త శంకర్ ఈ విషయాన్ని తెలియజేశారు. ఇక సోనాలి ఆత్మకు శాంతి కలగాలని ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నారు.