90’s సిరీస్ తో పాపులారిటీ తెచ్చుకున్న మాస్టర్ రోహన్, 35 సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్న మాస్టర్ అరుణ్ కలిసి నటించిన చిత్రం ‘సమ్మర్ హాలిడేస్’ (Summer Holidays). అనేక సార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఎంత వరకు మెప్పించిందో తెలుసుకుందాం రండి :
కథ: రావూరి వెంకటేశ్వరరావు అలియాస్ RVకి(అరుణ్) క్రికెట్ అంటే చాలా ఇష్టం. అంతేకాదు తన ఫ్రెండ్స్ తో సరదాగా గడపడాన్ని ఎక్కువగా ఇష్టపడతాడు. కానీ అతని తండ్రికి( హర్ష వర్ధన్) ఇవేవీ నచ్చవు. చదువుకుంటే తప్ప భవిష్యత్తు లేదు అనే మూస పద్ధతిలో ఉంటాడు. అందుకే RVపై ఒత్తిడి చేస్తూ ఉంటాడు. అంతేకాదు వేరే పిల్లలతో ఆడుకోవడానికి కూడా అంగీకరించడు. అయితే భార్య(వాసుకి) కోరిక మేరకు RVకి ఒక ఆఫర్ ఇస్తాడు. ఒకవేళ ఎగ్జామ్స్ లో కనుక RV క్లాస్ లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటే… క్రికెట్ కిట్ కొనివ్వడంతో పాటు క్రికెట్ అకాడమీలో కూడా జాయిన్ చేస్తాను అంటూ మాట ఇస్తాడు. కానీ RVకి టెన్త్ ర్యాంక్ వస్తుంది. దీంతో అతన్ని తిట్టి పోస్తాడు తండ్రి. ఇదంతా చూసి తట్టుకోలేని తల్లి RVని సమ్మర్ హాలిడేస్‌లో భాగంగా తన సొంత ఊరైన తోట వారి పాలెంకి తీసుకెళ్తుంది. అంటే RV అమ్మమ్మగారి ఇంటికి అనమాట. ఆ ఊర్లో ఓ మామిడి తోటలో పనిచేస్తూ ఉంటాడు కాశి వెంకటేశ్వర్లు అలియాస్ KV( రోహన్). అతని కథేంటి? గతమేంటి? అతను పరిచయం అయ్యాక RV జీవితం ఎలా మారింది? KV కుటుంబానికి RV అమ్మమ్మ చేసిన సాయం ఏంటి? ఈ ప్రశ్నలకి సమాధానమే మిగిలిన సినిమా?
నటీనటుల పనితీరు: చిన్న పిల్లలైనప్పటికీ రోహన్ , అరుణ్ చేసిన పెర్ఫార్మెన్స్ అంతా ఇంతా కాదు. తండ్రి పెట్టే ఒత్తిడి తట్టుకోలేక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తో బాధ పడే అమాయకుడి పాత్రలో అరుణ్ బాగా సెట్ అయ్యాడు. డాన్సులు కూడా బాగా చేశాడు. ఇక రోహన్ ఎనర్జీ గురించి, కామిడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా? ఎప్పటిలానే బాగా చేశాడు. ఈసారి ఎమోషనల్ సీన్స్ లో కూడా బాగా చేశాడు. ముఖ్యంగా మదర్ తో వచ్చే ఎమోషనల్ సీన్స్ లో కన్నీళ్ళు పెట్టించాడు. ‘మన శంకర వరప్రసాద్ గారు’లో చిరంజీవి కూతురిగా చేసిన ఖుషి ఈ సినిమాలో కూడా చిన్న పాత్ర పోషించింది.
ఈమెకు పెద్దగా స్క్రీన్ స్పేస్ లేదు.. అక్కడక్కడా మెరుస్తుంది. KVకి క్రష్ గా కనిపించింది. లాస్ట్ సీన్లో ఈమె పాత్రకి ఇచ్చిన ట్విస్ట్ చిన్న సర్ప్రైజింగ్ ప్యాకేజ్ అవుతుంది. వాసుకి , జయసుధ ఇద్దరూ తమ స్థాయికి తగ్గ పెర్ఫార్మెన్స్ చేశారు. హర్ష వర్ధన్ బాగానే చేశాడు.. కానీ క్లైమాక్స్ లో ఈ పాత్రని ముగించిన తీరు సాదా సీదాగా ఉంది. రాజీవ్ కనకాల బాగా చేశాడు. రోహన్ తల్లి నాగమణి పాత్ర పోషించిన నటి కూడా బాగా చేసింది. మిగతా నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు బాగానే చేశారు.
సాంకేతిక నిపుణుల పనితీరు: కథతో సంబంధం లేకుండా రిలేటబుల్ ఎమోషన్స్ తో బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమాలు అరుదుగా వస్తాయి. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ‘సత్యం సుందరం’ ఆ కోవకి చెందిన సినిమాలే. ‘సమ్మర్ హాలిడేస్’ (Summer Holidays) కూడా అలాంటి ప్రయత్నమే.! దర్శకుడు శ్రీకర్ హర్ష వర్ధన్ పాత్రతో ఫస్ట్ హాఫ్ ను ఇంట్రెస్టింగ్ గా మొదలుపెట్టాడు. మొదటి 2 నిమిషాలకే సమ్మర్ హాలిడేస్ వరల్డ్ లోకి తీసుకెళ్లి పోయాడు. ఆ తర్వాత హైదరాబాద్ నుండీ కథని గోదావరి జిల్లాలకి షిఫ్ట్ చేసిన విధానం బాగుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఊరు, అమ్మమ్మ ఇల్లు ప్రత్యేకమైనవి. మామిడి తోటలు, కాలువలో స్నానాలు, తాటి ముంజలతో బండ్లు చేసుకుని ఆడుకోవడాలు, తోటలో కొబ్బరి మట్టలతో క్రికెట్ ఆడుకోవడాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కటేంటి.. చాలా నాస్టాలజిక్ ఎలిమెంట్స్ టచ్ చేశాడు దర్శకుడు. రోహన్ మధర్ క్యారెక్టర్ తో పండించిన ఎమోషన్ కూడా బాగా పండింది. ఇంటర్వెల్ ఎపిసోడ్ సాదా సీదాగానే ఉంది. సెకండాఫ్ లో జయసుధ – రాజీవ్ కనకాల మధ్య వచ్చే ఒక సన్నివేశం సింపుల్ గా ఉన్నా మంచి హై ఇస్తుంది. అలాగే హనుమాన్ ఎపిసోడ్ కూడా గూజ్ బంప్స్ తెప్పిస్తుంది. అయితే క్లైమాక్స్ లో ఓ బలమైన కాన్ఫ్లిక్ట్ ఉంటుందేమో అనుకుంటాం. అదేమీ లేకుండా లైటర్ వేన్ లోనే సినిమాని ముగించాడు దర్శకుడు. హర్ష వర్ధన్ పాత్రకి చివర్లో ఇంకొన్ని డైలాగులు పెట్టుండాల్సింది.
ఆ పాత్ర వెంటనే మారిపోవడం అనేది కన్విన్సింగ్ గా లేదు. సాధారణంగా మామిడి చెట్లకి వింటర్లోనే పూత పూస్తుంది. కానీ ఇందులో సమ్మర్లో పోసినట్టు చూపించారు. ఆ వెంటనే ఆ చెట్లు కాయలు కాయడం, వాటిని అమ్మడం వంటి సన్నివేశాలు లాజిక్ కి దూరంగా ఉంటాయి. అవి పక్కన పెట్టేస్తే.. ‘అమ్మమ్మ ఇంటిని మించిన కోచింగ్ సెంటర్ ఇంకోటి లేదు’ అంటూ వాసుకితో పలికించిన డైలాగ్ బాగా పేలింది. అలాగే ‘చదువుకున్నోడు పని చేస్తే ఉద్యోగం, చదువుకోనోడు పని చేస్తే కూలి ‘ అనే డైలాగ్ కూడా రిలేటబుల్ గా అనిపిస్తుంది. సినిమాలో ఇలాంటి సంభాషణలు ఇంకా ఉన్నాయి. గోదావరి స్లాంగ్ కూడా బాగా సెట్ అయ్యింది. సింజిత్ సంగీతం కూడా ఈ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్. ఎక్కడా బ్యాలన్స్ తప్పకుండా సినిమా మూడ్ కి తగ్గ ట్యూన్స్ ఇచ్చి.. దీని స్థాయి పెంచాడు. నిడివి 2 గంటలే ఉండటం ఈ సినిమాకి ఇంకో ప్లస్ పాయింట్.
విశ్లేషణ: ఎటువంటి హడావిడి లేకుండా ఓ 2 గంటల పాటు బ్యూటిఫుల్ నాస్టాలజిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా ‘సమ్మర్ హాలిడేస్’.
ఫోకస్ పాయింట్: రిలేటబుల్ అండ్ ఫీల్ గుడ్
రేటింగ్: 2.75/5