భారతీయ మహిళా సుమో రెజ్లర్ ఉన్నారా? టైటిల్ చూడగానే ఈ ప్రశ్న మీ మైండ్‌లో మెదిలే ఉంటుంది. ఎందుకంటే మన దేశంలో చాలా క్రీడలు ఉన్నా ఎక్కువగా తెలిసింది ఒక క్రీడ గురించే. మిగిలిన క్రీడల గురించి అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. ఇక అసలు విషయానికొస్తే.. ఇప్పటివరకూ మన దేశంలో వెండితెరపై అనేక స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ ఉన్న సినిమాలు వచ్చాయి. అలా ‘సుమో దీదీ’ అనే సినిమా వస్తోంది. భారతీయ మహిళా సుమో రెజ్లర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హేతల్ దవే కథే ఇది.
జయంత్ రోహత్గి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హేతల్ దవే పాత్రలో శ్రియం భగ్నానీ నటించారు. ఈ సినిమాను ఇప్పటికే టోక్యో ఫిల్మ్ ఫెస్టివల్, న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ఈ సినిమాను ప్రదర్శించి ప్రశంసలు కూడా అందుకున్నాఉ. ఇప్పుడు ఈ సినిమాను జీ5లో స్ట్రీమ్ చేయబోతున్నాడు. ఈ మేరకు ఓ టీజర్‌ను విడుదల చేశారు. ‘నువ్వు బరువు తగ్గకపోతే, నిన్నెవరు పెళ్లి చేసుకుంటారు’ అంటూ కుటుంబ సభ్యులు హేతల్ దవేని ప్రశ్నించడంతో మొదలైన టీజర్‌లో ఆమె సుమో రెజ్లర్‌గా ఎలా మారిందనేది చూపించారు.
హేతల్ విషయానికొస్తే.. భారత దేశంలో తొలి మహిళా సుమో రెజ్లర్‌గా, ప్రపంచంలో టాప్ 5లో ఒకరు ఆమె. ముంబయికి చెందిన ఆమెకు చిన్నతనం నుండి క్రీడలంటే ఇంట్రెస్ట్. ఆమె తండ్రి సుధీర్ దవే ఎప్పుడూ పిల్లల్ని క్రీడలవైపు ప్రోత్సహించేవారు. అన్నయ్య మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకునేటప్పుడు హేతల్ కూడా సాధనకు వెళ్లేది. తాను జూడో నేర్చుకుంటానని ఇంట్లో చెబితే కుటుంబ సభ్యులు ఓకే అన్నారు. అది నేర్చుకున్నాక కుస్తీ సాధన చేసింది. అప్పుడే సుమో రెజ్లర్ అవ్వాలనుకుంది. కానీ శిక్షణ ఇవ్వడానికి కోచ్‌లు ముందుకు రాలేదు.
దాంతో తన తండ్రి, సోదరుడి సాయంతో సాధన చేయడం మొదలు పెట్టిన హేతల్.. చదువుకుంటూనే.. సుమో రెజ్లింగ్‌పై పట్టు సాధించింది. అయితే విదేశాలకు వెళ్లి ఆడటానికి స్పాన్సర్ చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. కుటుంబ సభ్యుల డబ్బులతోనే ఈస్టోనియాలో జరిగిన నేషనల్ సుమో ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంది. ఆ తర్వాత 2015లో ఏషియన్ సుమో ఛాంపియన్ షిప్‌లో కాంస్య పతకం, 2016లో నేషనల్ సుమో ఛాంపియన్ షిప్‌లో స్వర్ణ పతకం సాధించింది. ఇప్పుడు ఆమె కథ ప్రేక్షకులను ఎంతగా మెప్పిస్తుందో చూడాలి.