నారా రోహిత్, నాని బాటలో సునీల్!

Advertisement

కమెడియన్ నుండి హీరోగా మారాక సునీల్ పరిస్థితి ఏమిటన్నది సినీజనమెరిగినదే. ‘పూలరంగడు’ తర్వాత ఒక్కటంటే ఒక్క హిట్ కోసం ‘భీమవరం బుల్లోడు’గా ‘జక్కన్న’గా పలు రూపాలు మారుస్తున్నాడు. అయితే విజయం సునీల్ కి అందనంత సుదూరంగా ఉండిపోయింది. ఆ విషయం ఇటీవల విడుదలైన ‘ఈడు గోల్డ్ ఎహే’ సినిమాతోనూ నిరూపితమైంది. ఇదిలా ఉంటే ఈ సంవత్సరం క్యాలెండర్ మారేలోపే మరో సినిమాతో తెరమీదికి రానున్నాడు సునీల్.

‘ఓనమాలు’ లాంటి సినిమాతో మెగాఫోన్ పట్టి, ‘మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు’ లాంటి ఫీల్ గుడ్ సినిమాని తెలుగు ప్రేక్షకులకు అందించిన దర్శకుడు క్రాంతి మాధవ్ సునీల్ హీరోగా ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. పరచూరి కిరీటి నిర్మిస్తోన్న ఈ సినిమా 70 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ‘ఉంగరాల రాంబాబు’ పేరుతో తెరకెక్కుతోన్న ఈసినిమాని డిసెంబర్ 23న బాక్సాఫీస్ బరిలో నిలపాలని దర్శక నిర్మాతలు నిర్ణయించుకున్నారట. విడుదలలో ఆలస్యమైన ‘కృష్ణాష్టమి’ సహా సునీల్ నటించిన మూడు సినిమాలు ఈ ఏడాది తెరమీదికొచ్చాయి. ఇప్పుడు నాలుగో సినిమా రానుంది. ఈ వరుస చూస్తుంటే సునీల్ నారా రోహిత్, నాని బాటలోనే నడుస్తున్నట్టు అనిపిస్తోంది. అయితే వారికి విజయాలున్నాయి. ఇతగాడి ఖాతాలో అంతా శూన్యం. అంతే తేడా. ఈ సినిమా అయినా ఆ లోటు పూడ్చుతుందేమో చూడాలి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus