కోలీవుడ్‌లో ఇప్పుడు ఓ అదిరిపోయే కాంబినేషన్ సెట్ అవ్వబోతోంది. అది ఎంత పెద్దది అంటే కమల్ హాస్ – రజనీకాంత్ కాంబినేషన్ లాంటిది. తమిళ సినిమాలో అంత పెద్ద కాంబినేషన్ ఇంకేముంది అనుకుంటున్నారా? రజనీ – కమల్ అప్పటి గ్రేట్ డ్యుయో అయితే.. ఇప్పటి తరానికి సూర్య, ధనుష్ అలాంటి వారు మరి. అలాంటి ఇద్దరూ కలసి ఓ సినిమా చేస్తారని కోడంబాక్కం వర్గాల సమాచారం. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే త్వరలో ప్రాథమిక అనౌన్స్‌మెంట్ ఉంటుంది అని చెబుతున్నారు.
అంతేకాదు ఈ సినిమాను హ్యాండిల్ చేయబోతున్నది ప్రముఖ దర్శకుడు మణిరత్నం అని సమాచారం. ఆయన సినిమా, అందులోనూ ఇద్దరు పెద్ద హీరోలు కలసి చేస్తారంటున్న సినిమా నేపథ్యం పాన్ ఇండియానే అవుతుంది. కథ కచ్చితంగా అవుటాఫ్‌ది బాక్స్ అయినా అవుతుంది. లేదంటే చరిత్ర నుండి ఓ అంశం బయటకు తీసుకొని చేసేది అవుతుంది. నిజానికి కమల్ – రజనీతో మణిరత్నం ఓ సినిమా చేయాలని అనుకున్నారు. దాంతో ఆ కథనేమో అనే డౌట్ కూడా కోలీవుడ్ వర్గాల్లో ఉంది.
అయితే, ఇక్కడ సమస్యల్లా ఇద్దరు హీరోలూ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. రెస్ట్, గ్యాప్ లాంటి పదాలకు ఆస్కారం ఇవ్వకుండా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇలాంటి సమయంలో మణిరత్నం ముందుకొచ్చి కలసి సినిమా చేద్దాం అంటే అంత ఈజీగా డేట్స్ ఇచ్చేయగలుగుతారా అనేది ప్రశ్నగా మారింది. అయితే అడిగేది మణిరత్నం కాబట్టి కోలీవుడ్ హీరోలు ముందుకొస్తారు అని కూడా అంటున్నారు.
ఇదిలా ఉండగా.. ఇటీవల సూర్య, ధనుష్‌కి మణిరత్నం స్టోరీ లైన్ చెప్పారని, వారు కూడా ఆసక్తి చూపించారనే మరో వార్త కూడా చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం మణిరత్నం ‘అల్లం బెల్లం’ (ఇంజి వెళ్ళమ్) సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. విజయ్ సేతుపతి – సాయి పల్లవి కాంబోలో రూపొందుతున్న ఈ కోల్‌కతా – చెన్నై కథ వచ్చే సంక్రాంతికి విడుదల అవుతుంది అని సమాచారం.