మన తెలుగు ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడు ఒక్కో టాలెంట్ తో ఉన్నారు. కొందరు కధ రాసుకునే సమయంలోనే సినిమా కధకు తగ్గ టైటిల్ ఎంచుకుంటే, మరికొందరు కధ అంతా అయిపోయి, సినిమా ఒకే అయిన తరువాత టైటిల్ గురించి ఆలోచిస్తారు. ఇక మరికొందరు అయితే ఒక టైటిల్ నచ్చగానే దానికి తగ్గట్లుగా కధను అల్లుకుంటారు. ఇలా ఎవరికి వారు తమకు తోచిన పద్దతిలో వాళ్ళ, వాళ్ల టాలెంట్ తో ఇండస్ట్రీలో సరికొత్త సినిమాలకు ప్రాణం పోస్తున్నారు. ఇదిలా ఉంటే గతంలో జే.డీ చక్రవర్తి నటించిన ఒక సినిమాకి టైటిల్ లేకుండా సినిమా విడుదల చేసి, ఒక కాంటెస్ట్ లాంటిది పెట్టి, సినిమా చూసి సరైన టైటిల్ ఎన్నుకున్న వారికి మంచి బహుమతులు ఇస్తాం అంటూ చెప్పారు. ఇక ఆ సినిమా చూసి మంచి టైటిల్ ను పెట్టిన ఒక ఆమెకు భారీ బహుమతిని కూడా అందజేశారు. అయితే తాజాగా అలాంటి అవసరమే మరో సినిమాకు వచ్చింది. అదేమిటంటే అనిల్ సుంకర నిర్మాతగా, మిస్టర్ నూకయ్య ఫేమ్ అని కన్నెగంటి రూపొందిస్తున్న ఓ చిత్రంలో సందీప్ కిషన్, అనీషా ఆంబ్రోస్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఆ సినిమా షూటింగ్ ను ఒక నెలలోనే పూర్తి చేసేసి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఇదిలా ఉంటే ఈ సినిమా టైటిల్ పై సరికొత్త విషయం ఒకటి బయటకు వచ్చింది. మొదట్లో ఈ సినిమాకి 123 అనే టైటిల్ పెట్టాలని అనుకుని, కొత్తగా ట్రై చేస్తే బావుంటుంది అన్న భావనతో, టైటిల్ ముందుగానే ఫిక్స్ చెయ్యకుండా ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటో చెప్పి.. ప్రేక్షకుల్నే టైటిల్ ను ప్రేక్షకులనే సూచించమంటే బావుంటుంది అన్న ఆలోచనతో ట్రై చేశారు. ఇక కొత్తదనాన్ని ఎప్పుడూ కోరుకునే మన తెలుగు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. భారీగా టైటిల్స్ పై సజెషన్స్ రావడంతో అన్నింటినీ ఫిల్టర్ చేసి 5టైటిల్స్ ను ట్విట్టర్లో పెట్టింది చిత్ర బృందం. అవేమిటంటే 123, రన్, జిందగీ, నాకూ టైమొచ్చింది, టైమ్ బాబూ టైమ్. వీటిల్లో నుంచి ఒక టైటిల్ ని ఫిక్స్ చేసి దాన్ని పంపిన వారికి సర్ప్రైస్ గిఫ్ట్ కూడా ఉంటుందని తెలిపారు చిత్ర యూనిట్. ఏది ఏమైనా..సరికొత్తగా ఉంది ఈ పద్దతి.