తమన్నా అంటే అందం.. తమన్నా అంటే గ్రేస్.. తమన్నా అంటే హాట్.. తమన్నా అంటే స్వీట్. అయితే ఇదంతా గతం. ఈ మాట అన్నది మేం కాదు. ఆమె అంటోంది. వరుసగా యాక్షన్ బేస్డ్ క్యారెక్టర్స్ చేసి, చేసి రొమాంటిక్ సన్నివేశాలంటే మరచిపోయిందట. ఆమె సత్యదేవ్తో కలసి నటిస్తున్న చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’. ఇందులో చాలా రోజుల తర్వాత ఆమె చాలా రోజుల తర్వాత ప్రేమికురాలిగా కనిపించబోతోంది. ఈ నేపథ్యంలో తమన్నా తన సినిమాల ఎంపిక గురించి మాట్లాడింది.
వరుసగా ప్రేమకథలు చేస్తున్నా అని అనుకుందో, లేక కొత్తదనం కోసం ట్రై చేసిందో కానీ… ఈ మధ్య తమన్నా యాక్షన్ సినిమాలవైపు వచ్చేసింది. ‘బాహుబలి’, ‘సైరా’లో కత్తి పట్టుకుని వీరనారిగా మారిపోయింది. ఈ క్రమంలో మామూలు సినిమాలకు దూరమైపోయింది. చాలామంది అభిమానులు అనుకున్న ఈ మాటల్ని, తమన్నా కూడా అనుకుందంట. ‘‘నేను ప్రేమకథ చేసి చాలా రోజులైంది. కత్తి పట్టుకుని రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడం మరిచిపోయాను’’ అని అంది. ఈ మాట అనుష్క కూడా గతంలో అన్నట్లు గుర్తు కదా.
‘‘ఒకేలా సినిమాల్లో కాకుండా కొంచెం కొత్తగా చేయాలని అనిపిస్తుండేది. కరోనా- లాక్డౌన్ సమయంలో చాలా కథలు విన్నాను. కొత్త కొత్త సినిమాలు చూశాను. ఆ సమయంలోనే ఈ కథ గురించి దర్శకుడు చెప్పారు. వెంటనే ఒప్పేసుకున్నా. ప్రేక్షకురాలిగా మంచి అనుభూతిని పంచే కథల్ని సినిమాలుగా చూడాలని అనిపిస్తోంది. దర్శకులు సినిమాలు తీసేటప్పుడు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి’’ అని తమన్నా కోరింది.