మొన్నే “అభినేత్రి 2” లాంటి డిజాస్టర్ తర్వాత తమన్నా మళ్ళీ అదే జోనర్ లో తెరకెక్కుతున్న “రాజుగారి గది 3” ఎందుకు సైన్ చేసిందా అని విశ్లేషకులతోపాటు తమన్నా అభిమానులు కూడా బాధపడ్డారు. మరి వాళ్ళ బాధకు సమాధానం దొరికిందో లేక మరింకేదైనా జరిగిందో తెలియదు కానీ.. తమన్నా ఉన్నపళంగా “రాజుగారి గది 3” నుంచి బయటకు వచ్చేసింది. ఇది జరిగి మూడు రోజులవుతున్నా విషయం బయటకొచ్చేసరికి కాస్త లేట్ అయ్యింది.
తొలుత ఓంకార్ కేవలం తమన్నా పాత్ర వరకూ మాత్రమే కథ చెప్పి.. ఆమె చేత సైన్ చేయించాడు. అందుకే తమన్నా పూజా కార్యక్రమాలకు కూడా హాజరైంది. అయితే.. ఇటీవల ఫుల్ స్టోరీ విన్న తమన్నా చాలా మార్పులు చెప్పిందట. ఆ మార్పులు చేస్తేనే సినిమాలో నటిస్తానని లేదంటే లైట్ అని అల్టిమేటం కూడా జారీ చేసిందట. తాను రాసుకొన్న కథ మీద విపరీతమైన నమ్మకం ఉన్న ఓంకార్ కథలో మార్పులు చేయడానికి నిరాకరించడంతో.. తమన్నా సైలెంట్ గా సినిమా నుంచి వాకౌట్ చేసిందట. దాంతో ఇప్పుడు ఓంకార్ హీరోయిన్ కోసం వెతుకులాటలో పడ్డాడు. మరి ఓంకార్ కి హీరోయిన్ ఎప్పుడు దొరుకుతుంది? సినిమా ఎప్పుడు సెట్స్ కు వెళుతుంది? వంటి ప్రశ్నలకు సమాధానం ఓంకార్ దగ్గరే ఉన్నాయి.