తేజ సజ్జ- ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో రూపొందిన ‘జాంబీ రెడ్డి’ మూవీ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ క్రేజీ కాంబినేషన్లో ‘హనుమాన్’ అనే పాన్ ఇండియా మూవీ రాబోతుంది. ఇటీవల రిలీజ్ అయిన ‘హనుమాన్’ టీజర్ కు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. ఈ నేపథ్యంలో ‘హనుమాన్’ టీజర్ గురించి అలాగే మూవీ గురించి హీరో తేజ సజ్జ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ‘ఫిల్మీ ఫోకస్’ తో పంచుకున్నారు. ఆ విశేషాలు మీ కోసం :
ప్ర: ‘ఆదిపురుష్’ టీజర్ కంటే మీ ‘హనుమాన్’ టీజర్ బాగుందని అంతా అంటున్నారు? ఇలాంటి రెస్పాన్స్ వస్తుంటే ఎలా ఫీలవుతున్నారు?
తేజ : ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రభాస్ గారికి పెద్ద ఫ్యాన్ అండి. ‘ఆదిపురుష్’ ను ‘హనుమాన్’ టీజర్ తో పోల్చడం కరెక్ట్ కాదు. ‘ఆదిపురుష్’ మోషన్ క్యాప్చర్ మూవీ అని జనాలు ప్రిపేర్ అవ్వలేదు. అందుకే అలాంటి ఫీలింగ్ కలిగుండొచ్చు కానీ.. ఆ టీజర్ చాలా బాగుంది. మా టీజర్ ను ఆదరిస్తున్నందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. దయచేసి అలా కంపేర్ చేయొద్దు.
ప్ర : అయినప్పటికీ తక్కువ బడ్జెట్ లో టీజర్ కు గ్రాండియర్ లుక్ ను తీసుకురావడం మీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మకి ఎలా కుదిరింది?
తేజ : నిజానికి చాలామంది డైరెక్టర్స్… లొకేషన్స్ లో ఓకే చేసిన షాట్స్ ను మార్క్ చేసుకుంటారు. కానీ ప్రశాంత్ మాత్రం అక్కడితో వదలడు..! అతనికి ఎడిటింగ్, ఆర్.ఆర్, వి.ఎఫ్.ఎక్స్ వీటి పై చాలా ఇంట్రెస్ట్ అతనికి..! డైరెక్టర్ కాకముందు నుండి అతనికి ఇది అలవాటు. ఎడిటింగ్ కూడా అతనికి వచ్చు.ఇప్పుడు తన సినిమాలకు చేయడం లేదు కానీ అతనికి వచ్చు. వి.ఎఫ్.ఎక్స్ పై కూడా అతనికి కీన్ ఇంట్రెస్ట్ ఎక్కువ.
వరల్డ్ సినిమాస్ లో వి.ఎఫ్.ఎక్స్ కోసం ఎలాంటి టెక్నాలజీ వాడుతున్నారో కూడా అతను అనలైజ్ చేసుకుంటాడు. మా సినిమాకి బడ్జెట్ లిమిటేషన్స్ ఉండటం వల్ల ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడలేదు. ఇప్పుడో కొత్త టెక్నాలజీ వచ్చింది. మనం బ్యాక్ గ్రౌండ్ ముందు క్రియేట్ చేసుకొని ఒక బైనాక్యులర్ లాంటిది,వ్యూ ఫైండర్ లాంటిది.. తెచ్చి పెట్టి… ఆర్టిస్ట్ పై పెడితే.. ఆ ఆర్టిస్ట్ ఆ బ్యాక్ గ్రౌండ్లో ఉన్నట్టే కనిపిస్తుంది.
ఆ టెక్నాలజీ హైదరాబాద్ కు కూడా వచ్చింది. కానీ మాకు బడ్జెట్ లిమిటేషన్ ఉండటం వల్ల ఆ టెక్నాలజీ వాడలేదు.ఇక టీజర్ రిలీజ్ కు ప్రశాంత్ ఎన్ని కట్ లు చేస్తాడో.. మాకే తెలీదు. మమ్మల్ని నిద్ర పోనివ్వడు. హనుమాన్ టీజర్ కు నైట్ ఒంటిగంటకు స్టూడియోకి పిలిచి మరీ తనకు కావాల్సింది చేయించుకున్నాడు. నాకు ఇంత పెద్ద సినిమా అవకాశం వచ్చింది అంటే అతనే కారణం.
ప్ర : ‘హనుమాన్’ మూవీ కోసం మీరు కూడా పెట్టుబడులు పెట్టారంటూ ప్రచారం జరిగింది? నిజమేనా?
తేజ : ప్రొడక్షన్ లో నేను ఎటువంటి ఇన్వెస్ట్మెంట్లు చేయలేదు.అది ఫాల్స్ న్యూస్. నిరంజన్ గారు 3 సినిమాలు చేశారు, నితిన్ గారితో కూడా ఓ సినిమా చేస్తున్నారు. ఇంకో పెద్ద డైరెక్టర్ కు అడ్వాన్స్ ఇచ్చారు.ఆయన రూ.50 కోట్ల బడ్జెట్ లో సినిమాలు చేస్తున్నారు. ‘ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్’ అనేది లీడింగ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ లో రూపొందే సినిమాలన్నీ వీళ్ళే డిస్ట్రిబ్యూట్ చేస్తారు.
అంత గొప్ప ట్రాక్ రికార్డ్ కలిగిన వాళ్ల బ్యానర్లో రూపొందే సినిమాల్లో నేను ఇన్వెస్ట్ చేయడం ఏంటండీ.! నాకు నిజంగా అంత ఉంటే.. కెరీర్ స్టార్టింగ్ నుండి చిన్న చిన్న రోల్స్ ఎందుకు చేసుకుంటాను.? అవన్నీ కంప్లీట్ గా ఫాల్స్ అండి. నిర్మాతలు అలాంటి వార్తలు చూస్తే ఫీలవుతారు..!
ప్ర : టీజర్ చూస్తుంటే ఓ రూ.200 కోట్ల బడ్జెట్ మూవీలా అనిపించింది? ఈ సినిమాకి బడ్జెట్ ఎంతయ్యింది?
తేజ : అంత బడ్జెట్ అయితే అవ్వలేదండీ..! కానీ ఒక్క క్లారిటీ ఇస్తున్నా..! బడ్జెట్ విషయంలో మా సినిమాకి పెట్టింది… నాన్ థియేట్రికల్ రైట్స్ బిజినెస్ తో 70 పర్సెంట్ రికవరీ అయ్యింది. తెలుగు శాటిలైట్, డిజిటల్, ఇంకా హిందీ కూడా కలుపుకుని రూ.17 కోట్ల వరకు రికవరీ అయ్యింది. మిగిలిన లాంగ్వేజెస్ ఇంకా అమ్మాల్సి ఉంది.
ప్ర : ‘హనుమాన్’ చిత్రాన్ని ఎన్ని రోజుల్లో తీశారు?
తేజ : ‘హనుమాన్’ షూటింగ్ కు 100 రోజులు పట్టిందండీ.! యాక్షన్ షెడ్యూల్స్ ఎక్కువ ఉండటం.. అందువల్ల మాకు గాయాలు అవ్వడం.. ఈ కారణాల వల్ల షూటింగ్ డేస్ 100 రోజులు పట్టింది. నాకు ఈ సినిమా షూటింగ్లో 3 సార్లు గాయాలు అయ్యాయి. మొదటి షెడ్యూల్ కే నాకు సి3,సి4 సివియర్ ఇంజురీస్ అయ్యాయి.వారం రోజుల పాటు తల కదపలేని పరిస్థితి కూడా ఏర్పడింది.
ప్ర.’హనుమాన్’ లో పెద్ద క్యాస్టింగ్ కనిపిస్తుంది.. వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా నటించారు? సో క్యాస్టింగ్ గురించి చెప్పండి..!
తేజ : వరలక్ష్మీ శరత్ కుమార్ గారికి ఈ సినిమా ఐడియా చెప్పగానే ఓకే చేసేశారు.ఆవిడ ఈ మూవీలో నా సిస్టర్ రోల్ చేశారు. ఆవిడతో పని చేయడం చాలా బాగా అనిపించింది. చాలా డెడికేషన్ ఉన్న నటి ఆమె. అలాగే ఈ సినిమాలో అందరూ బాగా చేశారు. గెటప్ శ్రీను గారి కామెడీ ట్రాక్ ఈ సినిమాలో కూడా ఉంది. ‘జాంబీ రెడ్డి’ లానే ఈ మూవీలో కూడా ఆయన కామెడీ హిలేరియస్ గా ఉంటుంది. వెన్నెల కిషోర్ గారు, సత్య గారు కూడా చేశారు.
ప్ర: టీజర్ లో విలన్ ను చూపించి చూపించినట్టు చూపించారు కదా?
తేజ : ‘డాక్టర్’ సినిమాలో విలన్ వినయ్ రాయ్ గారు ‘హనుమాన్’ లో మెయిల్ విలన్ గా చేశారు.
ప్ర : మీరు హీరోగా చేసిన సినిమాల్లో ‘ఇష్క్'(2022) పెద్దగా ఆడలేదు. ఆ సినిమా రిజల్ట్ ను ఎలా తీసుకుంటారు?
తేజ : ‘ఇష్క్’ విషయంలో నాకు రిగ్రెట్ ఫీలింగ్ ఏమీ లేదు. కోవిడ్ తర్వాత జనాలు అంత హార్డ్ హిట్టింగ్ మూవీని చూడాలనుకోలేదేమో. రాంగ్ టైంలో రిలీజ్ అయ్యింది అనుకుంటున్నాను. కానీ నేను 50 కి పైగా సినిమాల్లో నటించాను. ఈ మొత్తంలో నా బెస్ట్ పెర్ఫార్మన్స్ ‘ఇష్క్’ అని చాలా మంది ఫ్రెండ్స్ చెప్పారు.
ప్ర : అద్భుతం స్ట్రైట్ గా ఓటీటీలో రిలీజ్ అయ్యింది. దాని ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది?
తేజ : ‘అద్భుతం’ అయితే హాట్ స్టార్ లో సూపర్ హిట్ అయ్యింది అండి.! ఇటీవల డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వాళ్ళు ఫోన్ చేసి ‘వన్ ఇయర్ కంప్లీట్ అయ్యింది..హాట్ స్టార్ లో హైయెస్ట్ వ్యూయర్ షిప్ మీ సినిమాకి నమోదైంది అని చెప్పారు. ‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్’ లో ‘అద్భుతం’ మూవీకి 15 మిలియన్ పైగా వ్యూయర్ షిప్ నమోదైంది.
ప్ర : వి.ఎఫ్.ఎక్స్ మాత్రమే కాకుండా ‘హనుమాన్’ నుండి ప్రేక్షకులు ఎలాంటి ఎలిమెంట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు..?
తేజ : ఇది ప్రాపర్ కమర్షియల్ ఎంటర్టైనర్ అండీ.! ఈ సినిమాలో దైవత్వం ఉంటుంది. అలాగే కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. హనుమంతుడు వంటి గొప్ప దేవుడు అనుగ్రహంతో పుట్టిన ఓ కుర్రాడికి సూపర్ పవర్స్ వస్తే ఎలా ఉంటుంది అన్నది ‘హనుమాన్’ మెయిన్ థీమ్.
ప్ర : ‘హనుమాన్’ రిలీజ్ ఎప్పుడుండొచ్చు?
తేజ : 2023.. ఫిబ్రవరి ఎండ్ కు లేదా మార్చి ఎండ్ కు రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం.