Jai Hanuman: అసలు హీరోకే చోటు లేదా.. తేజ మాటల్లో ఆంతర్యం అదేనా?

‘హనుమాన్’ సినిమా విజయం వెనుక తేజ సజ్జ పాత్ర ఎంత ఉందో అందరికీ తెలుసు. ఒక సామాన్యుడికి శక్తి వస్తే ఎలా ఉంటుందనే పాయింట్ వల్లే ఆ సినిమాకు ఆడియన్స్ అంతలా కనెక్ట్ అయ్యారు. కానీ ఇప్పుడు సీక్వెల్ విషయానికి వస్తే సీన్ మొత్తం రివర్స్ అయినట్లు కనిపిస్తోంది. ఇటీవల తేజ సజ్జ తన భవిష్యత్ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ.. మిరాయ్ సీక్వెల్, జాంబిరెడ్డి 2 పేర్లు గట్టిగా చెప్పారే తప్ప, ఎంతో ప్రతిష్టాత్మకమైన ‘జై హనుమాన్’ ఊసే ఎత్తలేదు. ఇదే ఇప్పుడు ఇండస్ట్రీలో అనేక అనుమానాలకు తావిస్తోంది.

Jai Hanuman

నిజానికి దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎప్పుడైతే రిషబ్ శెట్టిని హనుమంతుడి పాత్ర కోసం అనౌన్స్ చేశారో, అప్పుడే సినిమా స్కేల్ అమాంతం మారిపోయింది. బహుశా దర్శకుడు కథను పూర్తిగా దైవత్వానికి సంబంధించిన అంశాల వైపే నడపాలని డిసైడ్ అయ్యి ఉండొచ్చు. ఈ ప్రాసెస్ లో మొదటి పార్ట్ లోని హనుమంతు (తేజ) పాత్రను పక్కన పెట్టేసి ఉంటారని విశ్లేషకులు భావిస్తున్నారు. కాంతారా ఫేమ్ రిషబ్ వచ్చాక, ఫోకస్ మొత్తం ఆయన మీదే ఉంటుంది కాబట్టి, తేజ పాత్రకు స్కోప్ తగ్గిపోయి ఉండొచ్చు.

సాధారణంగా ఒక ఫ్రాంచైజీ అంటే లీడ్ యాక్టర్ కంటిన్యూ అవ్వాలి. ఆడియన్స్ ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యింది ఆ పాత్ర ప్రయాణంతోనే. ఇప్పుడు సడెన్ గా హీరో లేకుండా సినిమా తీస్తే, అది సీక్వెల్ అవుతుందా లేక సపరేట్ మైథలాజికల్ సినిమా అవుతుందా అనే సందేహం ఫ్యాన్స్ లో ఉంది. తేజ మాత్రం చాలా తెలివిగా తన దారి తాను చూసుకుంటున్నారు. మిరాయ్ సక్సెస్ తో ఆయన చూపు ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్ పై పడింది.

మరోవైపు ప్రశాంత్ వర్మ కూడా రిషబ్ డేట్స్ అడ్జస్ట్మెంట్, ఇతర కమిట్మెంట్లతో సతమతమవుతున్నారు. ఈ బిజీ షెడ్యూల్ లో స్క్రిప్ట్ లో భారీ మార్పులు జరిగి ఉంటాయి. అందుకే తేజ ఆ సినిమా గురించి మాట్లాడటం లేదని అర్థమవుతోంది. ఒకవేళ తేజ లేకుండా సినిమా వస్తే, మొదటి పార్ట్ చూసి ఎమోషనల్ అయిన ఫ్యాన్స్ ను మెప్పించడం ప్రశాంత్ వర్మకు కత్తి మీద సాము లాంటిదే. అఫీషియల్ క్లారిటీ వస్తే కానీ ఈ సస్పెన్స్ వీడదు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus