ఒకప్పటి హీరోయిన్లు చాలా మంది ఈ మధ్యకాలంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెడుతున్నారు. ఇప్పుడు మరో హీరోయిన్ కూడా రీఎంట్రీకి సిద్ధమైంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు చేసిన నటి షాలిని ఆ తరువాత హీరోయిన్ గా కొన్ని సినిమాలు చేసింది. అయితే కొన్నాళ్లకు స్టార్ హీరో అజిత్ ను పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైంది. దాదాపు ఇరవై ఏళ్లుగా ఆమె గృహిణిగా ఉంటూ కుటుంబ బాధ్యతలను చూసుకుంటుంది.
ఇలాంటి తరుణంలో ఆమె తన సెకండ్ ఇన్నింగ్ ను మొదలుపెట్టాలనుకుంటుందట. ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఓ వెబ్ సిరీస్ తీస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఆమె ఓ కీలకపాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ తమిళ నవల ‘పొన్నియన్ సెల్వన్’ ఆధారంగా వెబ్ సిరీస్ ను రూపొందిస్తున్నారు మణిరత్నం. గతేడాదిలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అయితే లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. రీసెంట్ గా షూటింగ్ ని పునః ప్రారంభించారు. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతోంది.
ఈ సిరీస్ లో హీరో విక్రమ్, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష, కార్తీలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో నటి షాలిని ఓ కామెడీ రోల్ పోషిస్తున్నారని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఈ నెలాఖరు నుండి షాలిని షూటింగ్ లో పాల్గొనున్నారని తెలుస్తోంది. షూటింగ్ కోసం ఆమె చెన్నై నుండి హైదరాబాద్ కి రానుంది. షాలిని చివరిగా నటించిన చిత్రం ‘పిరియాధ వరం వెండం’. 2001లో విడుదలైన ఈ సినిమాలో ప్రశాంత్ హీరోగా నటించారు.