కొంతమంది ఆరాను మ్యాచ్ చేయడం ఎవరి తరమూ కాదు. చాలా సందర్భాల్లో మీరు మాట విని ఉంటారు, కొన్నిసార్లు ఆ ఫీలింగ్‌ను హ్యాపీగా ఫీలై ఉంటారు కూడా. దీనిని చాలామంది శనివారం రాత్రి చూశారు. ఇటు ఆఫ్‌లైన్‌లో, అటు సోషల్ మీడియాలో మొత్తం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఆరానే కనిపిస్తోంది. దానికి కారణం ఎన్టీఆర్ ట్రస్ట్‌కి సంబంధించిన విజయవాడలో నిర్వహించిన యుఫోరియా మ్యూజికల్ నైట్. తల సేమియా బాధితుల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ ఇటీవల ఓ మ్యూజికల్ కాన్సర్ట్‌ను నిర్వహించింది.
ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ (S.S.Thaman) ఆధ్వర్యంలో టీమ్ మొత్తం వచ్చి ఉచితంగా ఈవెంట్ చేశారు. దీనికి ప్రముఖ కథానాయకుడు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్ కూడా విచ్చేశారు. ఆయన వచ్చినప్పటి నుండి వెళ్లినప్పటి వరకు అక్కడ ఆఫ్‌లైన్‌లో, ఆ తర్వాత ఆన్‌లైన్, సోషల్ మీడియాలో మొత్తం ఆయనకు సంబంధించిన చర్చలే. దీనికి రెండు కారణాలు ఉన్నాయి.
ఒకటి పవన్ అనూహ్యంగా ప్రకటించిన భారీ విరాళం ఒకటి కాగా, రెండోది ఆ వేదిక మీద తమన్ అండ్ టీమ్ ఆలపించిన పాటలు, వాయించిన మ్యూజిక్. పవన్ కల్యాణ్ పాటలు, టీజర్‌లకు సంబంధించిన మ్యూజిక్‌ను తమన్ ఇలా ఎత్తుకున్నారో లేదో జనాలు పూనకాలు వచ్చినట్లు ఊగిపోయారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వాటిలో ‘ఓజీ’ (OG Movie), ‘బ్రో’ (BRO) సినిమాల మేషప్ ఒకటి జనాలక తెగ నచ్చేసింది.
పవన్ ఆ ఈవెంట్‌కి రావడం ఆలస్యం ‘ఓజీ.. ఓజీ’ అంటూ తెగ సందడి చేశారు. దీంతో శనివారం రాత్రి నుండి సోషల్ మీడియాలో ఆ పేరు మారుమోగిపోతోంది. మామూలుగా పవన్ పొలిటికల్ ఈవెంట్లకే బయటకు వస్తున్నారు. అలా వచ్చినప్పుడు సినిమా పేరు ఎత్తితే ఆయన ఊరుకోవడం లేదు. ఇది రాజకీయ కార్యక్రమం, ప్రభుత్వ కార్యక్రమం అని చెబుతున్నారు. నిన్న సినిమా బేస్డ్, సాయం కార్యక్రమం కాబట్టి ఫ్యాన్స్ తమ ఆనందాన్ని ఇలా చూపిస్తున్నరన్నమాట.