దసరా బ్లాక్‌బస్టర్ తర్వాత హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రూపొందిన మూవీ ది ప్యారడైజ్. సాఫ్ట్ హీరోగా ఇమేజ్ ఉన్న నాని…మాస్ కథతో సినిమా చేయడంతో ఆరంభం నుంచే ప్యారడైజ్ తెలుగు ఆడియెన్స్‌లో ఆసక్తిని రేకెత్తిస్తూ వచ్చింది. కయదు లోహర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో సీనియర్ హీరో మోహన్‌బాబు విలన్‌గా కనిపించారు. సోనాలి కులకర్ణి ఓ కీలక పాత్ర పోషించారు. గురువారం థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఎలా ఉంది? దసరా తర్వాత ప్యారడైజ్‌తో నానికి డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల మరో హిట్టు ఇచ్చాడా? లేదా? అంటే?
కథ: ప్యారడైజ్‌లో బతికే సవారీ జాతి వాళ్లంతా శిఖంజా మాలిక్ (మోహన్‌బాబు) కింద బానిసలుగా బతుకుంటారు. తనకు ఎదురుతిరిగిన వారిని దారుణంగా చంపేస్తుంటాడు శిఖంజా మాలిక్. సవారీ జాతికి గుర్తింపు కోసం సమ్మక్క (సోనాలి కులకర్ణి) పోరాటం చేస్తుంటుంది. సమ్మక్క త్యాగాన్ని తప్పుగా అర్థం చేసుకున్న ఆమె కొడుకు జడల్ (నాని) తల్లికి దూరంగా బతుకుంటాడు. ఓ హత్య కేసులో 14 ఏళ్లు జైలుకు వెళతాడు. శిఖంజా మాలిక్‌పై పగతో జైలు నుంచి తిరిగి ప్యారడైజ్‌కు వస్తాడు జడల్. వచ్చి రావడంతో మాలిక్ కొడుకు విక్రమ్‌తో (రాఘవ్ జుయాల్) గొడవ పడతాడు. ఆ గొడవ కారణంగానే తల్లి తన కోసం పడిన కష్టం జడల్‌కు తెలుస్తుంది.
తమ జాతికి గుర్తింపు తీసుకురావాలనే సమ్మక్క కల కోసం ప్యారడైజ్‌కు నాయకుడిగా మారతాడు. శిఖంజా మాలిక్ కొడుకువిక్రమ్‌ను చంపేస్తాడు. కొడుకు చావుతో రగిలిపోయిన శిఖంజా మాలిక్ జడల్‌ను ఎలా దెబ్బకొట్టాడు? తన వారి కోసం చేసిన పోరాటంలో జడల్‌కు ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి? అతడి లక్ష్యానికి అండగా నిలిచిన సుబ్బలక్ష్మి (కయదు లోహర్) ఎవరు? జడల్‌తో పాటు ప్యారడైజ్‌లో ఉన్న వారందరిపై తీవ్రవాదాలుగా ఎందుకు ముద్రపడింది? సమ్మక్క కలను జడల్ నెరవేర్చాడా? లేదా? అన్నదే ప్యారడైజ్ మిగిలిన కథ.
నటీనటుల పనితీరు: నాని తన కెరీర్‌లో లవర్‌బాయ్, పక్కింటి కుర్రాడి లాంటి సాఫ్ట్ రోల్స్‌లోనే ఎక్కువగా కనిపించాడు. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ రోల్‌లో అతడు చేసిన ఫస్ట్ మూవీ ఇది. జడల్ పాత్ర కోసం నాని పడిన కష్టం ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తుంది. అతడి లుక్‌తో పాటు అటిట్యూడ్, డైలాగ్ డెలివరీ, మ్యానరిజమ్స్ డిఫరెంట్‌గా ఉన్నాయి. నానిపై వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ వయలెన్స్ కాస్త ఎక్కువే అయ్యింది. కయదు లోహర్ పాత్రకు ఇంపార్టెన్స్ లేదు. ఆమెపై వచ్చే చిలకా ఎపిసోడ్ యూత్ ఆడియెన్స్ కోసమే కథలో బలవంతంగా ఇరికించినట్లుగా అనిపిస్తుంది. శిఖంజా మాలిక్ పాత్రలో మోహన్‌బాబు విలనిజం సినిమాకు ప్లస్ పాయింట్‌గా నిలిచింది. హీరోకు ధీటుగా అతడి పాత్రను తీర్చిదిద్దాడు డైరెక్టర్. కొన్ని సీన్లలో వింటేజ్ మోహన్‌బాబు గుర్తొచ్చాడు.
మోహన్‌బాబు కొడుకుగా బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయాల్ ఫస్ట్ హాఫ్‌లోతన యాక్టింగ్‌తో మెప్పించాడు.. సమ్మక్క పాత్రలో సీనియర్ హీరోయిన్ సోనాలి కులకర్ణి సహజ నటనతో ఆకట్టుకుంది. నానితో ఆమె కాంబినేషన్‌లో వచ్చే ఎమోషనల్ సీన్లు ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. కేసీఆర్ పాత్రను పోలినట్లుగా వచ్చే ప్రియదర్శి క్యారెక్టర్ సెకండాఫ్‌లో సినిమాకు సర్‌ప్రైజ్ ఎలిమెంట్‌గా నిలిచింది. అతడి పాత్రకు రాసిన డైలాగ్స్ కూడా కేసీఆర్‌ను గుర్తుకు తెస్తాయి. తనికెళ్లభరణి, సంపూర్ణేష్‌బాబుతో మిగిలిన వారి నటన ఒకే. ఏషనాగుల పాటలో కీర్తి సురేష్ స్టెప్పులు మాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటాయి.
సాంకేతిక వర్గం పనితీరు: గుర్తింపు కోసం ఓ జాతి సాగించిన పోరాటానికి తల్లీకొడుకుల ఎమోషన్‌ను జోడించి దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ప్యారడైజ్ కథను రాసుకున్నారు. అయితే ఈ ఎమోషన్‌ను యాక్షన్, వయలెన్స్ డామినేట్ చేశాయి. అనవసరపు ఫైట్ సీన్లు, మితిమీరిన హింసతో సినిమాను నింపేశారు దర్శకుడు. ఫస్ట్ హాఫ్‌లో సరైన ట్రాక్‌లోనే వెళ్లిన డైరెక్టర్ సెకండాఫ్‌లో తడబడిపోయారు. ప్యారడైజ్‌కు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ మరో హీరోలా నిలిచాడు. ఏషనాగుల, ఆయా షేర్ పాటలతో పాటు బీజీఎమ్ ఈ సినిమాకు అనిరుధ్ ప్రాణం పోశాడు. సినిమా డౌన్ అయిన ప్రతిసారి తన మ్యూజిక్‌తో హై ఫీల్ ఇచ్చాడు. సాయి సినిమాటోగ్రఫీ బాగుంది. బ్లాక్ అండ్ వైట్ టోన్ వచ్చేలా మురికివాడ విజువల్స్‌ను చూపించిన తీరు ఆకట్టుకుంటుంది. రెండు గంటల యాభై మూడు నిమిషాల రన్‌టైమ్‌తో ఈ సినిమా రిలీజైంది. లెంగ్త్ కాస్త ఎక్కువైన ఫీలింగ్ కలుగుతుంది. సినిమా మొత్తం మురికివాడ సెట్‌లోనే తీశారు. సెట్స్ కోసం నిర్మాత భారీగానే బడ్జెట్ పెట్టారు.
విశ్లేషణ: తమ జాతి, ప్రజల కోసం హీరో పోరాడటం అనే కాన్సెప్ట్ తెలుగులో కొత్తదేమీ కాదు. పెద్ది, ఛత్రపతి మొదలుకొని టాలీవుడ్‌లోఈ కాన్సెప్ట్‌తో చాలానే సినిమాలు వచ్చాయి. ప్యారడైజ్ కూడా ఈ ఛాయలతోనే సాగుతుంది. సవారీ ప్రజలకు గుర్తింపు తీసుకురావాలనే తల్లి కలను ఓ కొడుకు ఎలా నెరవేర్చాడు అనే పాయింట్‌తో డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఈ కథను రాసుకున్నారు. అందులోనూ నాని లాంటి సాఫ్ట్ హీరోతో ఇలాంటి మాస్ కథను చేయాలని అనుకోవడం ఒక రకంగా సాహసమనే చెప్పాలి. ఈ రిస్క్‌లో కొంత వరకే సక్సెస్ అయ్యాడు డైరెక్టర్.
ఆరంభ సన్నివేశాలతో ప్యారడైజ్ ప్రపంచంలోకి బాగానే తీసుకెళ్లాడు డైరెక్టర్. హీరో చేతిపై ఓ పచ్చబొట్టు…తల్లి గురించి ఓ కఠిన నిజం… వాటి ద్వారా పగతో అతడు రగిలిపోయినట్లుగా చూపిస్తూ అసలైన కథలోకి ఫాస్ట్‌గానే ఎంటరయ్యాడు. ఆ తర్వాతే హీరోయిన్ ఎంట్రీతో అసలు స్టోరీ పక్కదారి పట్టింది. బూతు సినిమాలు అంటూ టైమ్‌పాస్ చేశాడు. లవ్‌స్టోరీ కూడా సోసోగానే ఉంటుంది. మళ్లీ ఇంటర్వెల్ ఎపిసోడ్ కథ గాడిలో పడుతుంది. ఇంటర్వెల్ ఫైట్ సీక్వెన్స్‌తో సెకండాఫ్ కోసం ఆసక్తిగా ఎదురుచూసేలా చేశాడు డైరెక్టర్. నానిపై మోహన్‌బాబు ఎటాక్ చేసే సీన్, తన వారిని కాపాడుకోవడం హీరో ఫైట్ చేసే సీన్లు బాగున్నాయి. విలన్‌ను దెబ్బకొట్టడం కోసం హీరో వేసే ఎత్తుల్లో థ్రిల్లింగ్ ఫ్యాక్సర్ మిస్సయ్యింది.
సెకండాఫ్ బోర్‌గా మారుతోన్న టైమ్‌లో ప్రియదర్శి క్యారెక్టర్ ఆడియెన్స్‌లో జోష్ నింపుతుంది. కేసీఆర్ తలపించే పాత్రలో అతడి చెప్పిన డైలాగ్స్‌కు విజిల్స్ పడటం ఖాయం. చిన్నారిని కాపాడటం కోసం ప్యారడైజ్‌లోని ప్రజలంతా కలిసి చేసే ఫైట్‌తో క్లైమాక్స్‌ను బాగా డిజైన్ చేసుకున్నారు. క్లైమాక్స్‌లో సీనియర్ ఎన్టీఆర్ పోలిన పాత్ర ఎంట్రీ ఇవ్వడం ఆకట్టుకుంటుంది.
తల్లికొడుకుల ఎమోషనల్ ఈ కథకు కీలకం. ఆ సన్నివేశాలను డెప్త్‌గా రాసుకోవడంలో తడబడిపోయాడు. సినిమాలో చాలా చోట్ల లాజిక్‌లు మిస్సయ్యాయి. ప్యారడైజ్ కథ జరిగే టైమ్ పీరియడ్ 1985 అన్నట్లుగా చూపించారు. కానీ ప్రస్తుత కాలానికి చెందిన పలు అంశాలు సినిమాలో కనిపిస్తాయి. విలన్‌గా మోహన్‌బాబు పాత్ర పరిచయం అదిరిపోయింది. అలాంటి సీన్లు ఇంకొన్ని పడుంటే బాగుండేది. మోహన్‌బాబు క్యారెక్టర్‌ను ఎలా ముగించాలో తెలియని కన్ఫ్యూజన్‌లో ఎండ్ చేసినట్లుగా అనిపిస్తుంది. ఓవరాల్‌గా ప్యారడైజ్‌లో చాలానే లోపాలు ఉన్నాయి. వాటిని తన యాక్టింగ్‌తో నాని, మ్యూజిక్‌తో అనిరుధ్ కవర్ చేశారు. నానికి ఫ్యామిలీ ఆడియెన్స్‌లో మంచి పట్టు ఉంది. వయలెన్స్, యాక్షన్ కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకోవడం కష్టమే.
ఫోకస్ పాయింట్: ప్యారడైజ్ ఓన్లీ ఫర్ యాక్షన్ లవర్స్ . నటుడిగా నాని కొత్తగా కనిపించారు. కానీ డైరెక్టర్ ట్రీట్‌మెంట్‌లోనే ఫ్రెష్‌నెస్ మిస్సయ్యింది.
రేటింగ్: 2/5