గౌతమి పుత్ర శాతకర్ణి చరిత్ర తెలుసా?

  • January 10, 2017 / 08:19 AM IST

భారత దేశానికి ఘనమైన చరిత్ర ఉంది. అందులో తెలుగువారికి కొన్ని పేజీలున్నాయి. ముఖ్యంగా ఆంధ్రులైనా శాతవాహనుల కీర్తి భారత ఖండం నలుదిశలా వ్యాప్తి చెందింది. వీరి పాలన, ప్రాభవం క్రీస్తు పూర్వం ఒకటవ శతాబ్దం నుంచి క్రీస్తు శకం ఒకటవ శతాబ్దం వరకు కొనసాగింది. దాదాపు నాలుగు వందల ఏళ్లపాటు పాలించారు. శాతవాహన రాజుల్లో ఆద్యుడు సిముకుడు. ఈయన దక్షణ భారతంలో విశాలమైన ప్రాంతాన్ని పాలించారు. ఉత్తర భారత దేశంలో కూడా అనేక ప్రాంతాలను గెలిచారు. సిముకుడు తరవాత శాతవాహన రాజ్యాన్ని కృష్ణ వంశం దాదాపు 18 సంవత్సరాలు పాలించింది. ఆ తర్వాత శ్రీ శాతకర్ణి సింహాసనాన్ని అధిష్టించారు. ఈయన శక్తివంతమైన రాజు. దక్కన్ సామ్రాజ్యాన్ని విస్తరించడంతో విజయుడయ్యాడు. మగధ రాజ్యంలోని కొన్ని ప్రాంతాలను తన రాజ్యంలో కలుపుకున్నారు. అంతేకాదు పశ్చిమ ప్రాంతంలోని అనేక ప్రాంతాలని తన ఆధీనంలోకి తెచ్చుకున్నారు. విజయాలకోసం రాజసూయ, అశ్వమేధ యాగాలను నిర్వహించారు.

అయితే ఈయనకు ఎదురు దెబ్బ తగిలింది. కళింగ చక్రవర్తి మహా మేఘవాహనుడు అయిన ఖరవేలుడు తన సైన్యంతో దక్షిణాదిపై దండెత్తి అనేక ప్రాంతాలను తన రాజ్యంలో కలుపుకున్నారు. దీంతో కళింగ, శాతవాహనుల మధ్య పెద్ద యుద్ధం అనేక రోజుల పాటు సాగింది. ఈ పోరాటంలో ఖరవేలుడు గెలిచాడు. దీంతో శాతవాహనుల రాజ్యం కళింగ చక్రవర్తికి సామంత దేశంగా మారిపోయింది. కొంతకాలానికి శ్రీ శాతకర్ణి మరణించాడు. అప్పుడు అతని కుమారులు చిన్నపిల్లలు. దీంతో శాతకర్ణి భార్య నయనిక పాలన బాధ్యతలు చేపట్టింది. దేశాన్ని రక్షించుకోవడం ఆమెకు కష్టం అయింది. శకులు అనే విదేశీయులు శాతవాహనుల రాజ్యంలోని కొంత భాగాన్ని ఆక్రమించున్నారు. ఆంధ్ర ప్రాంతాన్ని శాతవాహనులు వదులుకోలేదు. ఈ ప్రాంతంలో ఉంటూ చాలా కాలం కాపాడుకుంటూ వచ్చారు. వీరి వంశంలో పరాక్రమ వంతుడు గౌతమి పుత్ర శాతకర్ణి. శాతవాహనుల్లో 25 వ చక్రవర్తి. శాతవాహనుల్లో ప్రసిద్ధుడు. అతని తల్లిదండ్రులు గౌతమి బాలశ్రీ, శివస్వతి శాతకర్ణి. గౌతమి పుత్ర శాతకర్ణి సామ్రాజ్యాన్ని 24 సంవత్సరాలు పాలించారు. క్రీస్తుశకం రెండో శతాబ్దం ప్రథమార్ధంలో శాతవాహనులు మరో సారి దక్షిణాదిన ప్రభావాన్ని చాటుకున్నారు.

గౌతమి పుత్ర శాతకర్ణి పేరుతో సామ్రాజ్యం విస్తరించింది. ప్రజలతో గొప్పరాజుగా కీర్తిపొందారు. ఓ వైపు సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ ప్రజల బాగోగులు చూసుకునేవారు. శాతవాహనుల పేరుని నలుదిక్కులా వ్యాప్తి చెందించారు. తమ ప్రాంతాన్ని ఆక్రమించిన విదేశీయులను మహారాష్ట్ర ప్రాంతానికి తరిమి కొట్టారు. పశ్చిమాన ఉన్న యవనులు, పహాలవ రాజ్యంపై దండెత్తి వాటిని తన రాజ్యంలో కలుపుకున్నారు. ఇలా దాదాపు భారత ఖండాన్ని మొత్తాన్ని జయించారు. తన విజయాలను శాసనాల రూపంలో పొందు పరిచారు. ఆయన క్రీస్తు శకం నూట నాలుగవ సంవత్సరంలో మరణించారు. ఆ తర్వాత ఆయన కుమారుడు వసిష్ఠ పుత్ర పుళుమాయి సింహాసనం చేపట్టాడు. ఈయన రాజ్యాలను గెలవడం కంటే ఉన్న రాజ్యాన్ని ఎవరూ ఆక్రమించ కుండా చూసుకున్నారు. శత్రువులతో వియ్యమందుకుని శత్రుత్వాన్ని మిత్రంగా మార్చుకొని యుద్ధాలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత శాతవాహనుల రాజ్యం క్రమంగా తగ్గిపోయి చిన్న రాజ్యాలుగా చీలిపోయాయి. చివరికి శాతవాహనుల చరిత్ర కాల గర్భంలో కలిసి పోయింది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus