ప్రెజంట్ జనరేషన్ కి కృష్ణకుమారి అనే పేరు చాలా ఓల్డ్ అనిపించొచ్చు, ఇంకా చెప్పాలంటే ఆ పేరుతో ఒక నటీమణి ఉండేదని, ఆమె అందానికి అప్పట్లో వారి తాతలు దాసోహమయ్యేవారని కూడా తెలియకపోవచ్చు. ఆమె బ్రతికున్నప్పుడు ఇండస్ట్రీ పెద్దలు కూడా ఆమెను పెద్దగా పట్టించుకొన్నది లేదు. పట్టించుకోవాల్సిన స్థాయిలో ఆమె కూడా లేదనుకోండి. ప్రశాంతంగా తన కూతురి వద్ద బెంగుళూరులో నివసించేవారావిడ. 2001లో వచ్చిన “ఫూల్స్” అనే చిత్రంలో ఆమె ఆఖరిసారిగా నటించారు. “పాతాళభైరవి, చదువుకున్న అమ్మాయిలు, అంతస్థలు” వంటి చరిత్రలో నిలిచిపోదగ్గ చిత్రాల్లో నటించిన కృష్ణకుమారి (85) ఇవాళ ఉదయం బెంగుళూరులోని ఆమె స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. మనిషి బ్రతికున్నప్పుడు ఆమె గురించి మాట్లాడుకోకపోయినా పర్లేదు కానీ.. చనిపోయినప్పుడు అతడు/ఆమెను కనీసం ఒక్కసారైనా స్మరించుకోకపోవడం పాతకములలో కెల్లా మహా పాతకము అనగా పెద్ద పాపం అని అర్ధం. అందుకే కృష్ణకుమారి అంటే తెలియని చాలా మంది కోసం ఆమె జననం మొదలుకొని మరణం వరకూ కొన్ని విషయాలు-విశేషాలు..!!
1936 కలకత్తాలో జననం..కృష్ణకుమారి తండ్రి వెంకోజీరావుగారు, తల్లి శచీదేవిగారు కలకత్తాలో నివసించే సమయంలో కృష్ణకుమారి జన్మించారు. వెంకోజీరావుగారు ఆంధ్రా పేపర్ మిల్లులో పేపర్ ఎక్స్ పర్ట్ గా వర్క్ చేసేవారు. కృష్ణకుమారి జననం అనంతరం కుటుంబం మొత్తం రాజమండ్రి షిఫ్ట్ అయ్యారు. ఆమె అక్క షావుకారు జానకి.
అక్కతో కలిసి తెలుగు, నాట్యం నేర్చుకొన్నారు.. చెన్నై నుంచి వలసరావడం, తండ్రి ఇంగ్లాండ్ లో మూడేళ్లపాటు ఉండడంతో ఇంట్లో అందరూ ఇంగ్లీష్ లోనే మాట్లాడేవారట. అయితే.. పిల్లలకి తెలుగు మాట్లాడడం రావడం కంపల్సరీ అని చెప్పి ఒక మాష్టారును ఇంటికి పిలిపించి మరీ ట్యూషన్ చెప్పించేవారట. ఇక అక్కయ్య షావుకారు జానకి నాట్యం నేర్చుకొంటున్నప్పుడు కృష్ణకుమారి కూడా కాలికి గజ్జె కట్టుకొని ఆడేవారట.
మూగమ్మాయ్ అనేవారు..కృష్ణకుమారి చాలా సైలెంట్. అక్క జానకి ఎప్పుడూ చలాకీగా ఉంటే కృష్ణకుమారి మాత్రం తన పని తాను చేసుకుంటూ ఉండేవారట. ఒకవేళ కోపం వచ్చినా ఒక మూల కూర్చుని జుట్టు పీక్కుంటూ ఏడ్చేవారట. అక్కాచెల్లెళ్ల చదువు సగం రాజమండ్రి, సగం చెన్నైలో జరిగింది. కాలేజ్ లో అందరూ కృష్ణకుమారిని ముఫ్ఫుగా “మూగమ్మాయ్” అని పిలిచేవారట.
అక్క పెళ్ళిలో అదొక్కటే తక్కువైంది..అప్పటికే “పట్నవాసం” అనే సీరియల్ లో నటించడం వల్ల జానకికి మంచి పేరు ఉంది. అప్పుడే ఆమెకు పెళ్లి చేశారు. అప్పటికి ఆ పెళ్లి చాలా గ్రాండ్ గా చేశారట. ఆ పెళ్ళిలో కృష్ణకుమారి నాట్య ప్రదర్శన కూడా ఇచ్చింది. కానీ.. అంత ఆర్భాటంగా జరిగిన వివాహ వేడుక జానకికి సంతోషాన్నివ్వలేదనే విషయమై కృష్ణకుమారి చాలాకాలం బాధపడేవారు.
భూకంపం మద్రాసుకు చేర్చింది..అక్క జానకి పెళ్లి అనంతరం కృష్ణకుమారి కుటుంబం అస్సాం వెళ్ళిపోయారు. అక్కడ కూడా నృత్య ప్రదర్శనలు ఇస్తూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకొన్నారు కృష్ణకుమారి. అయితే.. అక్కడ భూకంపాలు ఎక్కువగా ఉండడం, అలా భూకంపం వచ్చినప్పుడల్లా తల్లి శచీదేవి భయపడుతుండడంతో, తండ్రి ఉద్యోగరీత్యా అక్కడే ఉండాల్సి రావడంతో తల్లిని తీసుకొని కృష్ణకుమారి మద్రాసుకు షిఫ్ట్ అయ్యారు.
పుల్లయ్యగారి చలవతో జెమిని స్టూడియోలో..కృష్ణకుమారి తండ్రిగారికి ఆమె నాట్యం అంటే చాలా ఇష్టం. అందుకే ఆమె ఇష్టానికి భగ్నం కలగకుండా సి.పుల్లయ్యగారి దగ్గర జాయిన్ చేశారు. ఆయన జెమిని స్టూడియోలో డైరెక్టర్ గా వర్క్ చేసేవారు. ఆ విధంగా కృష్ణకుమారి జెమినిలోకి ఎంటర్ అయ్యారు.
సినిమా చూస్తుంటే.. సినిమా ఛాన్స్కృష్ణకుమారి ఒకసారి పాండీబజార్ లో “మారి టాకీస్” అనే థియేటర్ లో “స్వప్న సుందరి” అనే సినిమాకి వెళ్లినప్పుడు ఆమెను తమిళనాడు టాకీస్ అధినేత ఎస్.సౌందర్ రాజన్ గారి కుమార్తె కృష్ణకుమారిని చూసి వారి సంస్థ నిర్మిస్తున్న “నవ్వితే నవరత్నాలు” సినిమాలోని “సిండ్రిల్లా” పాత్ర కోసం కృష్ణకుమారిని ఎంపిక చేసుకొన్నారు. ఆ సినిమా విడుదలవ్వక ముందే ఆమె ఏకంగా 14 సినిమాలు సైన్ చేసింది.
కారు కొనడం కోసం 20 ఎకరాల భూమి అమ్మేశారు..అప్పుడే వరుస ఆఫర్లతో హీరోయిన్ గా బిజీ అవుతున్న కృష్ణకుమారికి సమాజంలో మంచి గౌరవమర్యాదలు దక్కాలనే ఉద్దేశ్యంతో ఆమె తల్లి శచీదేవి కాశీపట్నంలోని 20 ఎకరాల భూమిని 12 వేల రూపాయలకు అమ్మేసి హిల్మాన్ కారు కొనిచ్చారు.
ఫ్లాపుల కృష్ణకుమారి అనే పేరొచ్చింది..మొదటి సినిమా మొదలుకొని “బంగారు పాప” వరకూ వరుసగా ఫ్లాప్స్ వచ్చాయి. దాంతో కృష్ణకుమారి పేరు మీద కొన్ని పత్రికల్లో “ఫ్లాపుల హీరోయిన్” అంటూ శీర్షికలు వెలువడ్డాయి. ఇక సినిమాలు మానేద్దామనుకొంటున్న తరుణంలో ఎల్.వి.ప్రసాద్ గారు పిలిచి మరీ “ఇల వేల్పు” సినిమాలో రేలంగి సరసన కామెడీ రోల్ ఇచ్చారు. ఆ సినిమా వందరోజులు ఆడింది. ఆ సినిమా సక్సెస్ తో కృష్ణకుమారికి ఉన్న ఫ్లాప్ హీరోయిన్ అనే అపకీర్తి పోయింది.
“వద్దంటే పెళ్లి” తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు.. “ఇల వేల్పు” అనంతరం “వద్దంటే పెళ్లి, మగవారి మాయలు, గంగా గౌరి సంవాదం, సతీ సుకన్య, రమాసుందరి, జయ విజయ” వంటి వరుస ఆఫర్లు వచ్చాయి. ముఖ్యంగా విఠల్ ప్రొడక్షన్స్ లో ఆల్మోస్ట్ అన్నీ సినిమాలకు కృష్ణకుమారిని తీసుకొనేవారు. కృష్ణకుమారి ఎక్కువగా జానపద చిత్రాల్లో నటించారు. ఒక్క కాంతారావు సరసనే 28 సినిమాల్లో నటించారు కృష్ణకుమారి.
ఏయన్నార్ తో 18 సినిమాలు..“పెళ్లి కానుక” (1960) ఏయన్నార్-కృష్ణకుమారి కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా. ఆ సినిమాలోని “పులకించని మది పులకించు” అనే పాట బాగా ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత ఏయన్నార్ కాంబినేషన్ లో 18 సినిమాలు చేయగా.. అందులో 7 సినిమాలు ఆయనకు జంటగా హీరోయిన్ గా నటించారు. ఏయన్నార్ దగ్గరే డైలాగ్ మోడ్యులేషన్ నేర్చుకొన్నారు కృష్ణకుమారి.
రామారావు పునర్జన్మ ఇచ్చారు..రామారావుగారితో కృష్ణకుమారి దాదాపు 25 సినిమాల్లో నటించారు. వాటిలో “పిచ్చి పుల్లయ్య, వరకట్నం, దేవాంతకుడు, బందిపోటు” ప్రముఖమైనవి. “లక్షాధికారి” (1963) సినిమా షూటింగ్ టైమ్ లో “మబ్బులో ఏముంది” అనే పాట చిత్రీకరణ కోసం బీచ్ లో నడుస్తుండగా.. ఒక అల కృష్ణకుమారిని అమాంతం లాక్కెళ్ళిపోయింది. ఎన్టీయార్ గారు వదలకుండా పట్టుకొన్నారు కాబట్టి సరిపోయింది కానీ.. లేదంటే అప్పుడే సముద్రంలో కొట్టుకుపోయేదావిడ. అందుకే ఆమెకు ఎన్టీయార్ పునర్జన్మ ఇచ్చారు అని చెబుతారు.
2001లో సినిమాలకు గుడ్ బై..నిజానికి 1976లోనే సినిమాలకు స్వస్తి పలికినప్పటికీ కొందరు దర్శకనిర్మాతలు కోరడంతో కొన్ని సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో కనిపించేవారు కృష్ణకుమారి. దాసరి నారాయణరావు తెరకెక్కించిన “ఫూల్స్” అనే చిత్రంలో ఆమె ఆఖరిసారి వెండితెరపై కనిపించారు.
బెంగుళూరు ఎస్టేట్స్ లో సరదాగా..సినిమాలకు గుడ్ బై చెప్పేశాక కృష్ణకుమారి బెంగుళూరులోని ఎస్టేట్స్ లో సెటిల్ అయ్యారు. ఆమె కుమార్తెను ఎం.ఏ ఫిలాసఫీ చదివించిన కృష్ణకుమారి అంగరంగ వైభవంగా పెళ్లి చేసి తల్లిగానూ బాధ్యత తీర్చుకొన్నారు.
ప్రేక్షకుల గుండెల్లో రాజకుమారిగా నిలిచిపోనివ్వండి..ఆ తర్వాత ఆమెను సినిమాల్లో నటించమని ఎంతమంది కోరినా ఆమె చాలా సున్నితంగా ఆ ఆఫర్లను తిరస్కరించేవారట. ప్రేక్షకుల గుండేల్లో నేను “రాజకుమారి”గా ఇప్పటికీ నిలిచి ఉన్నాను. నన్ను అలాగే ఉండనివ్వండి అని నవ్వుతూ సమాధానమిచ్చేవారట.
నిజంగానే నేటికీ ఆమెను కలల రాజకుమారిగా పేర్కొంటారు కొందరు.