చాలా రోజులుగా టాలీవుడ్‌ని గమనిస్తే… శివరాత్రి టైమ్‌కి పెద్దగా సినిమాలు విడుదల చేసేది లేదు. అది చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా శివరాత్రిని పెద్దగా సీజన్‌లా ఫీల్ అయినట్లు కనిపించదు. అయితే ఈ సారి పరిస్థితి మారుతోంది. ఈ శివరాత్రి సీజన్‌ను కూడా ఫుల్‌గా వాడేయాలని టాలీవుడ్ అనుకుంటోంది. అందుకే ఏకంగా మూడు సినిమాలతో శివరాత్రి సీజన్‌ను బిజీగా చేశారు. అలా ఈ శివరాత్రి సినిమా రాత్రి కాబోతోంది. ఒకప్పుడు పాత సినిమాలు పడేవి… ఇప్పుడు కొత్తవే వస్తున్నాయి.
శివరాత్రికి ఈసారి మూడు సినిమాలు రాబోతున్నాయని ముందే అనుకున్నాం. అందులో శర్వానంద్ ‘శ్రీకారం’ ఒకటి. కిషోర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ కథానాయిక. ఇటీవల ఈ సినిమా నుండి విడుదలైన పాటకు మంచి స్పందన వచ్చింది. సినిమా సెటప్ చూస్తుంటే ఈసారి శర్వా గట్టిగానే కొట్టేలా ఉన్నాడు. మిగిలిన రెండు సినిమాల్లో అంత పేరున్న హీరోలు లేకపోయినా… పేరున్న దర్శకులు వెనుకున్నారు. ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి నిర్మాణంలో రూపొందుతున్న ‘గాలి సంపత్’, నాగ్ అశ్విన్ ప్రొడక్షన్లో తెరకెక్కుతున్న ‘జాతి రత్నాలు’ కూడా ఈ శివరాత్రికే వస్తున్నాయి.
‘జాతి రత్నాలు’ పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కితే… ‘గాలి సంపత్’ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో రాబోతోంది. ఈ రెండూ దేనికవే వైవిధ్యమైన సినిమాలు కావడం విశేషం. అయితే వీటితోపాటు నాలుగో సినిమా కూడా రంగంలో ఉన్నట్లు తెలుస్తోంది. మంచు విష్ణు – కాజల్ కీలక పాత్రల్లో నటించిన ‘మోసగాళ్లు’ కూడా అదే రోజు తీసుకురావాలని చూస్తున్నారట. అయితే దీనిపై అధికారిక ప్రకటన రాలేదు.