విలక్షణ నటుడిగా కెరీర్ ను ప్రారంభించిన మోహన్ బాబు.. దాదాపు అప్పటి స్టార్ హీరోలతో సమానంగా పారితోషికం అందుకునే రేంజ్ కి వెళ్లారు. మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో విలన్ గా చేసినప్పటికీ.. చిరంజీవితో సమానంగా మోహన్ బాబు పారితోషికం తీసుకున్న రోజులు చాలా ఉన్నాయి. అయితే విలక్షణ నటుడిగా స్టార్ గా ఎదిగిన మోహన్ బాబు ఇమేజ్ ను క్యాష్ చేసుకోవాలని అప్ కమింగ్ నిర్మాతలు, దర్శకులు భావించారు.
ఈ క్రమంలో కొన్ని సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో.. తానే నిర్మాతగా మారారు మోహన్ బాబు. ఈ క్రమంలో ‘అసెంబ్లీ రౌడీ’ వంటి సినిమాలు హిట్ అయినా.. ఇంకా చాలా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఓ దశలో సొంత ప్రొడక్షన్ ఆపేయాలని డిసైడ్ అయ్యారు. అలాంటి టైంలో రజినీకాంత్ కోరిక మేరకు తమిళంలో సూపర్ హిట్ అయిన ‘నట్టమై’ సినిమా రీమేక్ హక్కులను కొనుగోలు చేసి ‘పెదరాయుడు’ గా రీమేక్ చేశారు. ఆ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇండస్ట్రీ హిట్ గా కూడా నిలిచింది.
అటు తర్వాత రజినీకాంత్ అందించిన ఒక కథతో ‘రాయలసీమ రామన్న చౌదరి’ అనే సినిమా చేశారు మోహన్ బాబు. దీనిని సొంత బ్యానర్ పై నిర్మించారు. సురేష్ కృష్ణ దర్శకత్వం వహించారు. 2000 వ సంవత్సరం సెప్టెంబర్ 15న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. మోహన్ బాబు కెరీర్లో 500 వ సినిమా కావడంతో మంచి హైప్ ఏర్పడింది. సురేష్ కృష్ణ కూడా సూపర్ ఫామ్లో ఉండటంతో కచ్చితంగా ఇది ‘పెదరాయుడు’ రేంజ్ బ్లాక్ బస్టర్ అవుతుంది అని అంతా భావించారు.
కానీ కట్ చేస్తే.. ఆ మ్యాజిక్ రిపీట్ కాలేదు. బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ ను సాధించింది కానీ.. ‘పెదరాయుడు’ రేంజ్లో బ్లాక్ బస్టర్ గా అయితే నిలవలేకపోయింది. కానీ ఈ సినిమాలో రామన్న చౌదరిగా మోహన్ బాబు నటన అద్భుతం. మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా హైలెట్ అని చెప్పాలి.