కరోనా సినిమా ఇండస్ట్రీపై ఎంతగా ప్రభావం చూపిందో తెలిసిందే. దీని కారణంగా షూటింగ్ లు, సినిమా రిలీజ్ లు ఆగిపోయాయి. ఇప్పుడిప్పుడే పరిస్థితి మునుపటిలా మారుతోంది. జనాలు థియేటర్ కి వెళ్లి సినిమా చూడడం మొదలుపెట్టారు. దీంతో దర్శకనిర్మాతలు తమ సినిమాలను థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో రానా నటించిన రెండు సినిమాలు రెండు నెలల గ్యాప్ లో థియేటర్లోకి రాబోతున్నాయి. నిజానికి రానా నటించిన ‘అరణ్య’ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు.
కానీ వాయిదా వేసి మార్చి 26కి వాయిదా వేశారు. అయితే ఆ సమయానికి రానా నటించిన మరో సినిమా ‘విరాటపర్వం’ రెడీ అయిపోతోంది. ‘అరణ్య’ కోసం ‘విరాటపర్వం’ సినిమాను మరికొంతకాలం ల్యాబ్ లో ఉంచే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే.. ఈ సినిమా కూడా చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తోంది. దీంతో ఇప్పుడు ఈ సినిమాను కూడా సమ్మర్ లోనే విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించుకుంది. దర్శకుడు వేణు ఊడుగుల చెబుతున్న దాని ప్రకారం ‘విరాటపర్వం’ సినిమాను మే నెలాఖరున ప్లాన్ చేస్తున్నారు.
అలా చూసుకుంటే.. ‘అరణ్య’, ‘విరాటపర్వం’ సినిమాలకు మధ్య గ్యాప్ కేవలం రెండు నెలల మాత్రమే ఉంటుంది. ఒక్క రానా సినిమాల విషయంలో మాత్రమే కాకుండా మిగిలిన హీరోలు శ్రీవిష్ణు, సుమంత్, సత్యదేవ్ ల సినిమాలు కూడా ఇలానే మినిమమ్ గ్యాప్ లో థియేటర్లోకి రాబోతున్నాయి.