తాము నిర్మించే సినిమా సూపర్ హిట్టవుతుందని, సదరు చిత్ర నిర్మాత కలలు కనడం సహజం. “కాకి పిల్ల కాకికి ముద్దు” అన్న చెందాన ప్రతి ఒక్క నిర్మాత, తాను నిర్మించిన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయి, తనకు లాభాల పంట పండిస్తుందని భావిస్తాడు. మనిషి ఆశా జీవి కాబట్టి అలా ఆలోచించడంలో ఏమాత్రం తప్పులేదు.
కానీ.. వారాహి చలన చిత్రం అధినేత సాయి కొర్రపాటి మాత్రం తాను నిర్మించిన “రాజా చెయ్యి వేస్తే” సినిమా విషయంలో చూపిన “ఓవర్ కాన్ఫిడెన్స్”కి ఇప్పుడు భారీ మూల్యం చెల్లించుకొంటున్నాడు.
నారా రోహిత్ మరియు నందమూరి తారకరత్నలు కలిసి నటించిన “రాజా చెయ్యి వేస్తే” మొన్నామధ్య విడుదలై.. కనీసం విడుదలైందన్న విషయం కూడా చాలా మందికి తెలియదు. అప్పుడే థియేటర్ల నుంచి ఎత్తేసారు.
అయితే.. “రాజా చెయ్యి వేస్తే” చిత్ర నిర్మాణానికి దాదాపుగా 10 కోట్ల రూపాయలు ఖర్చైందని, విడుదలయ్యాక కనీసం అందులే పది శాతం కూడా కలెక్షన్ల రూపంలో తిరిగి రాలేదని యూనిట్ వర్గాల సమాచారం.
నారా మరియు నందమూరి నట వారసులు కలిసి నటించిన సినిమా కదా.. ఫ్యాన్స్ చూసినా చాలనుకొన్న వారాహి నిర్మాణ సంస్థకు చుక్కెదురైంది.
ఎంత చూసుకొన్నా.. ఏడెనిమిది కోట్ల మేరకు సాయి కొర్రపాటి నష్తపోయాడని తెలుస్తోంది. మరి ఈ నష్టాలను తన తదుపరి చిత్రాల ద్వారా భర్తీ చేసుకొంటాడేమో చూడాలి!