వరుణ్ తేజ్ ప్రస్తుతం ‘కొరియన్ కనకరాజు’ సినిమా విడుదల పనుల్లో బిజీగా ఉన్నాడు. సినిమాలకు లాంగ్ గ్యాప్ తీసుకొని, చాలాసార్లు ఆలోచించి, కొత్తగా ఉండాలనే ఆలోచనతో ఈ కథను ఎంచుకున్న వరుణ్ తేజ్ నమ్మకం ఎంతవరకు నిజమవుతుందో రేపు (ఆగస్టు 7) తేలిపోతుంది. ఆ విషయం పక్కన పెడితే ఆ సినిమా తర్వాత వరుణ్ చేయబోయే సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం ఒకటి బయటకు వచ్చింది. అదే జరిగితే ఆ సినిమా ఫ్యామిలీ సినిమా అయిపోతుంది. అవును.. మీరు అనుకుంటుంది నిజమే.
‘కొరియన్ కనకరాజు’ సినిమా తర్వాత వరుణ్ తేజ్ ‘బరి’ అనే సినిమా చేయనున్న విషయం తెలిసిందే. నిజానికి ఈ సినిమా ఈపాటికే స్టార్ట్ అవ్వాల్సి ఉన్నా.. ఆ సినిమా కోసం తీసుకుంటున్న ట్రైనింగ్‌లో వరుణ్ గాయపడ్డాడు. ఇప్పుడు ఆ గాయం నుండి కోలుకుంటూనే ‘కొక’ సినిమా ప్రచారంలో పాల్గొంటున్నాడు. అలా ప్రచారంలో భాగంగానే ‘బరి’ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం చెప్పుకొచ్చారు. అదే ఆ సినిమాలో నాగబాబు కూడా నటిస్తున్నారు అని. ఆ సినిమాను నిహారిక నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పుడు చెప్పండి ఈ సినిమా ఫ్యామిలీ సినిమానా కాదు. చెల్లి నిర్మాత, తండ్రీ కొడుకులు నటులు. ఇంకేం కావాలి చెప్పండి. విలేజ్ – వాలీబాల్ కాన్సెప్ట్‌లో ‘బరి’ సినిమా తెరకెక్కనుంది. ఈ మేరకు సినిమా ఓపెనింగ్ సమయంలో చిత్రబృందం విడుదల చేసిన ప్రచార చిత్రాల్లోనే ఇదంతా ఉంది. ఇక వరుణ్ గాయం కూడా ఆ ఆట ప్రాక్టీస్ చేస్తున్నప్పుడే అయింది. అయితే ఇప్పుడు ప్రశ్న సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అని.
షూటింగ్ స్టార్ట్ చేసినా.. వాలీ బాల్ సీన్స్ ఏవీ ఇప్పట్లో తెరకెక్కించరు అని సమాచారం. ఎందుకంటే వరుణ్ కాలికి అయింది చాలా పెద్ద గాయం. చూద్దాం ‘కొక’ (కొరియన్ కనకరాజు) రిలీజ్ తర్వాత ఈ విషయంలో స్పష్టత రావొచ్చు.