వరుణ్ డాక్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • October 10, 2021 / 09:40 AM IST

శివకార్తికేయన్ కథానాయకుడిగా నటించడమే కాక నిర్మాతగానూ వ్యవహరించి రూపొందించిన సినిమా “డాక్టర్”. “కో కో కోకిల” ఫేమ్ నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో “వరుణ్ డాక్టర్”గా అనువదించి విడుదల చేశారు. డార్క్ హ్యూమర్ జోనర్ కు చెందిన ఈ చిత్రం పాటలు ఆల్రెడీ సూపర్ హిట్ గా నిలిచాయి. ట్రైలర్ కూడా సినిమాపై మంచి ఆశలు రేకెత్తించింది. మరి సినిమా అదే స్థాయిలో ఉందో లేదో చూద్దాం..!!

కథ: వరుణ్ (శివకార్తికేయన్) పెళ్ళిచూపులు చూసిన అమ్మాయి పద్మిని (ప్రియాంక అరుల్ మోహన్) అన్నయ్య కూతురు కనిపించకుండాపోతుంది. ఆమెను వెతికే ప్రయత్నంలో గోవాలోని ఓ హ్యూమన్ ట్రాఫిక్కింగ్ గ్యాంగ్ తో తలపడాల్సి వస్తుంది ఈ కుటుంబం. అంత రిస్కీ వర్క్ ని, ఈ చిన్న ఫ్యామిలీ ఎలా చేసింది? వాళ్ళకి డాక్టర్ ఎలా ఉపయోగపడ్డాడు? అనేది సినిమా కథాంశం.

నటీనటుల పనితీరు: శివకార్తికేయన్ చాలా డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ లో కనిపించాడు. రెగ్యులర్ గా కనిపించే ఎనర్జీతో కాకుండా సబ్టల్ నటనతో అలరించాడు. కథాంశం తర్వాత శివకార్తికేయన్ పెర్ఫార్మెన్స్ హైలైట్ గా నిలిచిందని చెప్పాలి.

వినయ్ రాయ్ ఈ చిత్రంలో విలన్ గా ఆకట్టుకోవడానికి ప్రయత్నించాడు కానీ.. అతడి బాడీ లాంగ్వేజ్ “డిటెక్టివ్” సినిమాలో అతడు పోషించిన విలన్ పాత్రకు చాలా దగ్గరగా ఉండడం చిన్న మైనస్.

ప్రియాంక అరుల్ మోహన్ ఎప్పట్లానే క్యూట్ గా నటించింది. “శ్రీకారం”తో పోల్చుకుంటే బెటర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. యోగిబాబు కామెడీతో అలరించాడు. మిగతా ఆర్టిస్టులు ఆకట్టుకున్నారు.

సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు నెల్సన్ డార్క్ హ్యూమర్ స్పెషలిస్ట్ అని ఆల్రెడీ “కో కో కోకిల”తోనే ప్రూవ్ చేసుకున్నాడు. “వరుణ్ డాక్టర్”తో ఇంకాస్త ముందుకెళ్ళాడు. ఈ తరహా చిత్రాలను కేవలం కొరియన్ లేదా జపనీస్ భాషల్లోనే చూస్తుంటాం. ఆ జోనర్ ను సౌత్ లో సక్సెస్ చేసింది మాత్రం నెల్సన్. మరీ ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్ తోనే క్రైమ్ చేయించడం అనే కాన్సెప్ట్ తో రెండు సినిమాలు రెండు విభిన్నమైన కథాంశాలతో రాసుకోవడం అనేది ప్రశంసార్హం.

అయితే.. ఫస్టాఫ్ ను హిలేరియస్ కామెడీతో నడిపించిన నెల్సన్.. సెకండాఫ్ విషయంలో గాడి తప్పాడు. లాజిక్స్ అనేవి పెద్దగా పట్టించుకోలేదు. కాన్సన్ ట్రేషన్ మొత్తం కామెడీ మీద పెట్టాడు. డార్క్ హ్యూమర్ ను ఎంజాయ్ చేసే ఆడియన్స్ ను విపరీతంగా నచ్చే చిత్రమిది. ఒక సీరియస్ అంశాన్ని కామెడీగా అర్ధవంతంగా చెప్పడం అనేది మామూలు విషయం కాదు. సో, దర్శకుడిగా, కథకుడిగా నెల్సన్ మరో లెవల్ కి వెళ్ళినట్లే.

నెల్సన్ తర్వాత సినిమాకి ఆయువుపట్టుగా నిలిచిన వ్యక్తి సంగీత దర్శకుడు అనిరుధ్. క్లాసికల్ వెస్ట్రన్ మిక్స్ మ్యూజిక్ తో సినిమాకి ప్రాణం పోసేశాడు. నేపధ్య సంగీతంతో అనిరుధ్ ఇచ్చిన ఎలివేషన్ సినిమాకి మెయిన్ హైలైట్. కెమెరామెన్ విజయ్ కార్తీక్ కణ్ణన్ లెన్స్ ఒక డిఫరెంటి సినిమాటిక్ ఎక్స్ పీరియన్ ఇచ్చాయి. లైటింగ్, ఫ్రేమ్స్ అన్నీ కొత్తగా కనిపించాయి.

విశ్లేషణ: “కో కో కోకిల” సినిమా నచ్చిన ఆడియన్స్ కు “వరుణ్ డాక్టర్” విపరీతంగా నచ్చేస్తుంది. కొన్ని లాజిక్స్ పక్కన పెడితే.. రెండున్నర గంటలపాటు హిలేరియస్ గా ఎంటర్ టైన్ చేసే సినిమా ఇది. మధ్యలో ఎక్కడా పాటలతో డిస్టర్బ్ చేయకపోవడం సినిమాకి మరో ప్లస్ పాయింట్. అయితే.. తెలుగులో డబ్బింగ్ చేస్తున్నప్పుడు పదాలు సరిగా చూసుకోకపోతే అర్ధాలు మారిపోతాయి. ఈ సినిమాలో చివర్లో “మూడు నెలల ముందు” అనే స్లయిడ్ వస్తుంది.. నిజానికి అది “మూడు నెలల తర్వాత” అని. ఈ విషయంలో చిత్రబృందం కనీస జాగ్రత్త తీసుకోకపోవడం బాధాకరం.

రేటింగ్: 2.5/5

Click Here To Read in ENGLISH

Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus