వరుణ్ తేజ్ సినిమా తెరపైకి వచ్చి తొమ్మిది నెలలైంది. పూరి దర్శకుడిగా వరుణ్ నటించిన ‘లోఫర్’ 2015 డిసెంబర్ 17న విడుదలైంది. ‘బాహుబలి’ లాంటి భారీ చిత్రాలను మినహాయిస్తే ఓ సినిమా తయారవడానికి తొమ్మిది నెలల సమయం సరిపోతుంది. ఓ రకంగా ఎక్కువనే చెప్పాలి. అయినా ఇప్పటివరకు వరుణ్ తేజ్ సినిమా విడుదలవలేదు సరికదా ఈ ఏడాదిలో వస్తుందన్నదీ అనుమానమే. అయితే ఆ ఈ గ్యాప్ ని రెండు సినిమాలతో భర్తీ చేసేందుకు తన సర్వ శక్తులూ ఒడ్డుతున్నాడు ఈ మెగా హీరో.
‘లోఫర్’ తర్వాత ‘కంచె’ కాంబినేషన్ లో ఓ సినిమా వస్తుందనుకున్నా అది కుదరకపోయేసరికి పీకలమోతు ఫ్లాపుల్లో మునిగి ఉన్న శ్రీను వైట్లతో చేయి కలిపాడు వరుణ్. మిస్టర్ పేరుతో మొదలైన ఆ సినిమా కొన్నాళ్లవరకు షూటింగ్ జరగలేదు. అంతలో శేఖర్ ఖమ్ముల కథకు ‘ఫిదా’ అయిన వరుణ్ రెండు సినిమాలని ఒకేసారి చేస్తున్నాడు. ‘మిస్టర్’ తొలి షెడ్యూల్ తర్వాత బాన్సువాడలో జరిగిన ‘ఫిదా’ తొలి షెడ్యూల్ లో పాల్గొన్న వరుణ్, ‘మిస్టర్’ రెండో షెడ్యూల్ కోసం చిక్మల్గూర్ చేరుకున్నాడు. ఇలా రెండు సినిమాలను ఏక కాలంలో పూర్తిచేస్తున్నాడు వరుణ్. దీని ఫలితంగా రెండు సినిమాలు ఒకేసారి తెరమీదికొచ్చినా ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదు.