ఒక్క ట్వీట్ తో తేల్చి చెప్పిన వరుణ్ తేజ్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కి ఫిదా మంచి ఉత్సాహాన్నిచ్చింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. 60 కోట్లు వసూళ్లను సాధించింది. ఈ మూవీ తర్వాత వరుణ్ తేజ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో “తొలి ప్రేమ” సినిమా చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్లో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం చివరి షెడ్యూల్ జరుపుకుంటోంది. హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ రాశీఖన్నాలపై రొమాంటిక్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా తర్వాత అనేక ప్రాజెక్ట్ లకు వరుణ్ సైన్ చేసినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఘాజీ దర్శకుడు సంకల్ప్ రెడ్డి చెప్పిన సైన్స్ ఫిక్షన్ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో న్యూస్ షికారు చేస్తోంది. ఇది ఒక్కటే కాదు హరీష్‌ శంకర్ దర్శకత్వంలో మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న దాగుడు మూతలు సినిమాలో నటిస్తున్నారని ప్రచారం సాగుతోంది.రానా హీరోగా తెరకెక్కుతున్న హథీ మేరీ సాథీలోనూ, సీనియర్ హీరో వెంకటేష్ తో మరో మల్టీ స్టారర్ సినిమాలోనూ నటిస్తున్నారని ఎవరికీ తోచినట్లు రాసేస్తున్నారు. ఈ వార్తలు చూసి ఆశ్చర్యపోయిన వరుణ్ తేజ్ నేడు స్పందించారు. ప్రస్తుతం తాను తొలి ప్రేమ సినిమా చేస్తున్నానని, ఇతర ఏ ప్రాజెక్ట్ కి సైన్ చేయలేదని స్పష్టం చేశారు. ఒక్క ట్వీట్ తో అనేక గాసిప్ లకు చెక్ పెట్టారు. తమన్ సంగీతమందిస్తున్న తొలిప్రేమ వచ్చే నెల థియేటర్లోకి రానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus