డైరక్టర్ సుకుమార్ అంచనా తప్పలేదు. రంగస్థలం తర్వాత అనసూయ సినీ కెరీర్ మలుపుతిరుగుతుందనే మాట అక్షరాల నిజమైంది. భారీ ఆఫర్లు అనసూయ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నాయి. రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా అనసూయ మంచి నటన ప్రదర్శించింది. ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు సైతం ఆకట్టుకుంది. ఆమె కోసమే దర్శకులు కొన్ని క్యారెక్టర్స్ సృష్టిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి కొత్త కథని సిద్ధం చేశారు. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటించనున్న ఈ చిత్రానికి ఎఫ్2 (ఫన్ అండ్ ఫ్రస్టేషన్) అనే పేరును కూడా ఫిక్స్ చేశారు.
దిల్ రాజు నిర్మించనున్న ఈ మూవీ ఈ ఏడాది చివర్లో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇందులో నటించనున్న ఆర్టిస్టుల సెలక్షన్ సాగుతోంది. హీరోయిన్స్ గా తమన్నా, మెహ్రీన్ ని ఖరారు చేసినట్లు తెలిసింది. మరో కీలక పాత్రలో అనసూయ ని ఎంపికచేసినట్లు సమాచారం. గ్లామరస్ గా ఉంటూనే .. హాస్యాన్ని పండించే ఈ రోల్ కి సంతోషంగా అనసూయ ఓకే చెప్పినట్లు ఫిలిం నగర్ వాసులు తెలిపారు. ప్రస్తుతం వరుణ్ తేజ్ సంకల్ప్ రెడ్డి తో సినిమా చేస్తున్నారు. ఆ మూవీ పూర్తి అయిన వెంటనే మల్టీ స్టారర్ మూవీ షూటింగ్ లో పాల్గొననున్నారు.