విజయ్ దేవరకొండ .. వివాదాలతో సహవాసం చేసే హీరోల్లో ఇతను కూడా ఒకడు.సినిమా వేడుకల్లో వింత వింత డ్రెస్సులు ధరించి అతను రావడం.. డోంట్ కేర్ అన్నట్టు స్పీచ్ లు ఇవ్వడం ఇతని నైజం. ‘లైగర్’ వరకు ఇలాగే ఉండేది పరిస్థితి. అయితే ఆ సినిమా ఘోరపరాజయం పాలవ్వడంతో అతనిలో చాలా మార్పు వచ్చింది. అప్పటి వరకు అతను పెద్ద స్టార్ హీరో అని భ్రమలో ఉన్న బ్యాచ్లో సైతం మార్పులు వచ్చాయి.
విజయ్ కి ప్లాపులు ఉన్నాయి, దర్శకుడు పూరి జగన్నాథ్ కు ప్లాపులు ఉన్నాయి. కానీ వీళ్ళు గతంలో చేసిన ఏ సినిమా కూడా ‘లైగర్’ తెచ్చినన్ని భారీ నష్టాలు అయితే తెచ్చిపెట్టలేదు. అందుకే ‘లైగర్’ అనేది విజయ్ దేవరకొండ కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్.ఈ సినిమా ఫలితం యొక్క ప్రభావం విజయ్ తర్వాతి సినిమాల పడుతుందా? ఈ సినిమా ఫలితంతో విజయ్ దేవరకొండ తన కెరీర్ ను ఎలా ప్లాన్ చేసుకోబోతున్నాడు? ఈ విషయాల పై తాజాగా విజయ్ దేవరకొండ స్పందించి క్లారిటీ ఇచ్చాడు.
విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ” ‘లైగర్’ ఫ్లాప్ అయ్యింది కదా అని నేను గ్యాప్ తీసుకోవాలని భావించలేదు. ‘లైగర్’ తో నేను చాలా విలువైన పాఠాన్ని నేర్చుకున్నాను.నేను ఎక్కడికి వెళ్లినా నా అభిమానులు మంచి కంబ్యాక్ ఇవ్వాలని కోరుతున్నారు. వాళ్లకు నేను చెప్పే సమాధానం ఏంటో తెలుసా..? నేను ఎక్కడికీ వెళ్లలేదు కదా.. అని..!” అంటూ విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు. అంటే ‘లైగర్’ ఫలితం మరీ తనని అడ్రస్ లేకుండా చేసెయ్యలేదు కదా అనేది అతని ఆలోచన.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ.. ‘ఖుషి’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో సమంత హీరోయిన్ గా నటిస్తుంది. శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకుడు. ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా రూపొందిస్తున్నారు. జయరాం, మురళీ శర్మ, సచిన్ ఖడేకర్, అలీ, వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ , రోహిణి, లక్ష్మి వంటి వారు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.