సాధారణంగా ఒక స్టార్ హీరో సినిమా అంటే ఫ్యాన్స్ లో అంచనాలు ఉంటాయి. కానీ దళపతి విజయ్ చేస్తున్న ‘జన నాయగన్’ పరిస్థితి వేరు. ఇది ఆయన కెరీర్ కు ఆఖరి సినిమా మాత్రమే కాదు, ఆయన పొలిటికల్ ఎంట్రీకి వేస్తున్న అసలైన ఫౌండేషన్. ఇలాంటి ప్రతిష్టాత్మకమైన సినిమాపై సోషల్ మీడియాలో ఒక నెగటివ్ ప్రచారం గట్టిగా జరిగింది. బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’కి ఇది రీమేక్ అంటూ వచ్చిన వార్తలు ఫ్యాన్స్ ను టెన్షన్ పెట్టాయి. చివరికి మలేషియా వేదికగా డైరెక్టర్ వినోద్ దీనికి ఫుల్ స్టాప్ పెట్టారు.
అసలు ఈ రూమర్ పుట్టడానికి ప్రధాన కారణం విజయ్ లుక్. రిలీజ్ అయిన పోస్టర్స్ లో ఆయన సాల్ట్ అండ్ పెప్పర్ హెయిర్ స్టైల్ లో, కాస్త ఏజ్డ్ గా కనిపించారు. అచ్చం బాలయ్య గెటప్ లాగే ఉండటంతో, కథ కూడా అదేనని చాలామంది ఫిక్స్ అయిపోయారు. కానీ రాజకీయాల్లోకి వెళ్తున్న హీరోకి సొంత ఐడియాలజీ ఎంత ముఖ్యమో, చేసే సినిమాకు ఒరిజినాలిటీ కూడా అంతే ముఖ్యం. రేపు జనం మధ్యలో తిరగాల్సిన నాయకుడు, పక్కోడి కథను అరువు తెచ్చుకున్నాడు అనే మాట అనిపించుకోకూడదు.
అందుకే దర్శకుడు వినోద్ చాలా క్లియర్ గా చెప్పారు. ఇది 100% విజయ్ కోసమే రాసిన ఫ్రెష్ స్క్రిప్ట్ అని, రీమేక్ అనే మాటలో నిజం లేదని తేల్చి చెప్పారు. విజయ్ రాజకీయ ఆశయాలకు, ప్రజాసేవ అనే కాన్సెప్ట్ కు అద్దం పట్టేలా కథ రాసుకున్నారని అర్థమవుతోంది. కేవలం లుక్ ఒకేలా ఉన్నంత మాత్రాన, కంటెంట్ కూడా కాపీ అవ్వదు కదా!
జనవరి 9న సంక్రాంతి రేసులో ప్రభాస్ ‘ది రాజా సాబ్’ తో పోటీ పడుతున్న ఈ సినిమాపై ఇప్పుడు పాజిటివ్ వైబ్స్ వచ్చాయి. బాబీ డియోల్, పూజా హెగ్డే లాంటి భారీ కాస్టింగ్ ఉన్నా.. అందరి దృష్టి మాత్రం విజయ్ చేసే చివరి సంతకం మీదే ఉంది. రీమేక్ అనే మచ్చ లేకుండా, ఒక పవర్ ఫుల్ ఒరిజినల్ కథతో విజయ్ తన సినీ ప్రస్థానాన్ని ముగించడం ఆయన పొలిటికల్ కెరీర్ కు పెద్ద ప్లస్ అవుతుంది. కంటెంట్ లో దమ్ముంటే, బాక్సాఫీస్ దగ్గర దళపతి విజయఢంకా మోగించడం ఖాయం.