పాపం మెగా ఫ్యామిలీలో పుట్టడమే ఆమెకు తెలియకుండా నీహారిక కొణిదెల చేసిన తప్పో లేక.. ఆ కుటుంబంలో పుట్టి సినిమాల్లో నటించాలనే ఆసక్తితో అరుదుగా సినిమాలు చేస్తుండడం ఆమె చేసిన పొరపాటో తెలియదు కానీ ఆమె నటించిన మొదటి సినిమా “ఒక మనసు” నుంచి ఈవారం విడుదలవుతున్న “సూర్యకాంతం” వరకు ప్రతి సినిమాకి ఆమె పెళ్లి ఫలానా వ్యక్తితో అని వార్తలు వస్తూనే ఉన్నాయి. ఒక మనసు టైమ్ లో హీరో నాగశౌర్యతో ఆమె పెళ్లి అని వార్తలొస్తే.. “హ్యాపీ వెడ్డింగ్” టైమ్ లో ఒక దర్శకుడితో అమ్మడు ప్రేమ వ్యవహారం నడుపుతోందని గుసగుసలు వినిపించాయి. ఇక లేటెస్ట్ సినిమా “సూర్యకాంతం” సినిమాకి పాపం ఇంకెవరూ దొరకలేదేమో గాసిప్పురాయుళ్ళకి ఏకంగా విజయ్ దేవరకొండతో నీహారిక పెళ్లి అని ప్రచారం మొదలెట్టారు. ఎప్పటిలానే మెగా ఫ్యామిలీ నుంచి ఈ విషయమై ఎలాంటి స్పందన రాలేదనుకోండి.
కానీ.. విజయ్ దేవరకొండ ఈ గాసిప్పురాయుళ్ళ నోళ్ళు ఒకే ఒక్క మాటతో మూయించేశాడు. “గీతగోవిందం” విజయ్ దేవరకొండకి తండ్రిగా నటించాడు నాగబాబు. ఆ అభిమానంతోనే “ఒక పెద్ద కొడుకుగా ఈ ఈవెంట్ కి హాజరయ్యాను” అని క్లారిటీ ఇచ్చాడు విజయ్ దేవరకొండ. దాంతో నీహారిక కూడా వెంటనే విజయ్ కి స్టేజ్ మీదే థ్యాంక్స్ చెప్పేసింది. ఆ విధంగా ఈ కొత్త గాసిప్పుల నుంచి నీహారికను కాపాడాడు విజయ్ విజయ్ దేవరకొండ.