తమిళనాడు సీఎం విజయ్ చివరి చిత్రం (ప్రస్తుతానికి) వచ్చేసింది. తమిళంలో సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తున్నా.. తెలుగులో మాత్రం ‘జన నాయకుడు’ అలరించలేకపోయాడు అనే టాకే వస్తోంది. ‘భగవంత్ కేసరి’ చూసేసినందుకో, లేక అదే కథ అని అనుకోవడమో తెలియదు కానీ.. టాక్ అయితే ఇబ్బందిగానే వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మరో టాపిక్ సినిమాను ఇబ్బంది పెడుతోంది. అదే ఆ సినిమాలోని జైలు సన్నివేశం. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌పై ఆ సీన్ కౌంటర్ అనే విమర్శలు వినిపిస్తున్నాయి.
విమర్శలతో మొదలైన ఈ పరిస్థితి ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నేతలు, కార్యకర్తల ఆగ్రహావేశాలకు కారణమవుతోంది. ఎందుకంటే ఆ సినిమాలో చూపించిన సీన్ ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మీద సెటైర్ వేసినట్టుగా ఉండటమే. ‘జన నాయగన్’ సినిమాలో 50 ఏళ్ల నుండి రాజకీయాల్లో ఉన్న కుటుంబానికి చెందిన రోజా రంగస్వామి (ప్రకాష్ రాజ్) ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నిస్తుంటాడు.
ఈ క్రమంలో తన రాజకీయ గర్వం, అధికారంతో ఓసారి పోలీస్ అధికారి అమ్రిష్ పూజారి (బాబీ డియోల్)ని అవమానిస్తాడు. అలాంటి రోజా రంగస్వామి హీరో తలపతి వెట్రి కొండన్ అరెస్ట్ చేసి జైల్లో పెట్టిస్తాడు. అప్పుడు జైలులో ఉన్న రంగసామిని కలవడానికి అమ్రిష్ పూజారి వెళ్తాడు. ‘నేను నిన్ను చాలా అవమానించాను’ అని రోజా రంగసామి అంటే ‘బయటకు వచ్చిన తర్వాత నువ్వు సీఎం అవుతావు. నన్ను డిప్యూటీ సీఎంని చెయ్’ అని అమ్రిష్ పూజారి అంటాడు.
ఏపీ రాజకీయాల్లో సుమారు మూడేళ్ల క్రితం ఇలానే జరిగింది. అప్పటి ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడును వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అరెస్ట్ చేసి రాజమహేంద్రవరం జైలులో పెట్టింది. ఆ సమయంలో జైలుకు వెళ్లిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కలిశారు. నైతిక మద్దతు ఇచ్చి.. జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్‌తో కలసి ప్రెస్ మీట్ పెట్టి.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కలసి పోటీ చేస్తామని ప్రకటించారు. ఏపీ రాజకీయాలను మలుపు తిప్పిన సందర్భం అది.
ఈ అంశాన్నే ‘జన నాయగన్’ సినిమాలో ఎగతాళిలా పెట్టారు అని కొంతమంది వాదన. గతంలో తమిళంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రచారంలో వైఎస్ జగన్ ఫొటో పట్టుకొని కనిపించాడు విజయ్. ఇప్పుడు ఇలాంటి సీన్ సినిమాలో ఉండేసరికి విమర్శలు ఎక్కువవుతున్నాయి.