బాహుబలి సినిమా తెలుగు పరిశ్రమకి మాత్రమే కాకుండా.. భారతీయ చలన చిత్ర పరిశ్రమకి ఎంతో స్ఫూర్తిని ఇచ్చింది. ఆ మూవీ సాధించిన కలక్షన్స్ భారీ బడ్జెట్ సినిమాలు మొదలవ్వడానికి బలాన్ని ఇచ్చాయి. కథ, టేకింగ్, గ్రాఫిక్స్ విషయంలోనే కాకుండా బిజినెస్ విషయంలో ఒక గ్రంథంగా బాహుబలి మారింది. ఆ సినిమాకు ఆచరించిన విధానాలనే కొత్త సినిమాలకు పాటిస్తున్నారు. మలయాళీ దర్శకుడు ఆర్.ఎస్. విమల్ మహాభారతంలోని కర్ణుడి కథను దృశ్యరూపం ఇవ్వడానికి సిద్ధమయ్యారు. రెండేళ్ల క్రితమే మొదలవ్వాల్సిన ఈ ప్రాజెక్ట్ కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది. ఈ ప్రాజెక్ట్ లోకి విక్రమ్ జాయిన్ అవ్వడంతో పనులు ఊపందుకున్నాయి. “మహావీర్ కర్ణ్” అనే పేరుతో ఈ సినిమా హిందీ భాషలో తెరకెక్కనుంది.
రిలీజ్ మాత్రం దక్షిణాది, ఉత్తరాది భాషల్లో మాత్రమే కాదు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా వాడుకలో ఉన్న 37 భాషల్లో విడుదల చేయడానికి ఇప్పటి నుంచే ప్లానింగ్ చేస్తున్నారు. ఈ విషయంపై విక్రమ్ మాట్లాడుతూ “ బిజినెస్ కోసం అన్ని భాషల్లో విడుదల చేయడం లేదు. కర్ణుడి గురించి అందరూ తెలుసుకోవాలి. ‘టెన్ కమాండ్‌మెంట్స్’, ‘బెన్‌హర్’ సిన్మాలు ప్రపంచంలోని అన్ని భాషల ప్రేక్షకుల్నీ ఎలా ఆకట్టుకున్నాయో… మన మహాభారతంలోని కర్ణుడి కథ సైతం అంతమందినీ ఆకట్టుకోవాలి. అందుకే సాధ్యమైనన్ని ఎక్కువ భాషలో రిలీజ్ చేయాలనీ చూస్తున్నాం” అని విక్రమ్ పేర్కొన్నారు. యునైటెడ్ ఫిలిం కింగ్ సంస్థ 300 కోట్లతో నిర్మించనున్న ఈ సినిమా నవంబర్ లో సెట్స్ మీదకు వెళ్లనుంది. త్వరలోనే ఈ చిత్రం వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.