Vishal: ‘పందెంకోడి’ సినిమాని బలవంతంగా తెలుగులో రిలీజ్ చేయించారు.. ‘మకుటం’తో దర్శకుడిగా కూడా మారాను : విశాల్
- July 1, 2026 / 12:23 PM ISTByPhani Kumar
విశాల్(Vishal) సినిమాలకి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. ఇక సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై అయితే బోలెడన్ని సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. వీరి కాంబినేషన్లో ఓ సినిమా వస్తుందంటే.. సహజంగానే అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయి. అందులోనూ ‘సూపర్ గుడ్ ఫిలిమ్స్’ సంస్థలో రూపొందుతున్న 99వ సినిమా ఇది. దీంత హైప్ మరింతగా పెరిగింది. అంజలి, దుషార విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా వచ్చిన టీజర్, ఫస్ట్ సింగిల్ ‘ది రైజ్ ఆఫ్ లింగా’ వంటివి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.ఈ మధ్యనే సెకండ్ సింగిల్ గా ‘నచ్చాకే వచ్చేరా’ అనే పాటను విడుదల చేశారు. దానికి కూడా మంచి రెస్పాన్స్ లభిస్తోంది.
Vishal
ఇక ఈ సాంగ్ లాంచ్ వేడుకలో విశాల్ మాట్లాడుతూ ..” ‘మకుటం’తో దర్శకుడిగా మారి ఆడియెన్స్ ముందుకు వస్తున్నాను. ‘శివ’ సినిమా చూశాక డైరెక్టర్ అవ్వాలని ఫిక్స్ అయ్యాను. ఇన్నాళ్లకు నా కోరిక తీరుతుంది. ఈరోజు ఆర్‌బీ చౌదరి గారిని నేను మిస్ అవుతున్నాను. 99వ ప్రాజెక్ట్ బాధ్యతల్ని ఆయన నాకు ఇచ్చారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మూవీకి దర్శకుడిగా మారాల్సి వచ్చింది.

ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నానే అనుకుంటున్నాను. సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ నుండి డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్న వారిలో నేను 45వ వాడిని. సుబ్రహ్మణ్యం గారు నా మీద పెట్టుకున్న నమ్మకంతోనే ‘మకుటం’ ఈ స్థాయి వరకు వచ్చింది. ఈ సినిమా కోసం ఏడాదిపాటు నా పర్సనల్ లైఫ్ ను కూడా పక్కన పెట్టాను. ఈ ప్రాజెక్టు విషయంలో సాయి ధన్సిక నాకు చాలా సపోర్ట్ చేసింది. ‘లింగా’ పాట మంచి హిట్ అయింది. అందులో నన్ను సింగర్‌గా చేయడం జీవీ ప్రకాష్ తీసుకున్న రిస్క్ (నవ్వుతూ).
‘నచ్చాకే వచ్చేరా’ పాటను ప్రభ అద్భుతంగా పాడారు. ఆమె పాడిన ప్రతీ పాట చార్ట్ బస్టర్ అయ్యింది. దర్శకుడిగా నన్ను నమ్మి ఈ ప్రయాణంలో తోడుగా నిలిచిన తోటి నటీనటులందరికీ, సాంకేతిక నిపుణులకు థాంక్స్ చెప్పుకుంటున్నాను. నేను ఇప్పటివరకు పనిచేసిన దర్శకులందరి టెక్నిక్స్‌ను ఈ సినిమాలో వాడాను. ఈ సినిమా కోసం నా బెస్ట్ ఇచ్చాను. ఇంతకు మించి ఎక్కువ చెప్పకూడదు. ఈ చిత్రాన్ని చూసిన తర్వాత ఆడియెన్సే మాట్లాడాలి. మా నాన్న జీకే రెడ్డి గారి వల్లే నేను ఈరోజు ఇలా ఉన్నాను.
‘పందెంకోడి’ సినిమాని ఆయనే పట్టుబట్టి తెలుగులో రిలీజ్ చేయించారు. అప్పటి నుండి నాకు తెలుగు ప్రేక్షకులు మరింత ఓన్ చేసుకున్నారు. ఇప్పుడు దర్శకుడిగా కూడా నన్ను ఆధరిస్తారు అని భావిస్తున్నాను. నేను దర్శకుడిగా మారడానికి నన్ను ఇన్స్పైర్ చేసిన అర్జున్ గారికి, ఆర్జీవీ గారికి థాంక్స్. గత 22 ఏళ్లలో 35 సినిమాలు చేశాను. ఇంత వరకు నన్ను అభిమానించిన, ఆదరించిన ప్రేక్షకదేవుళ్లకు థాంక్స్.
అంజలి మాట్లాడుతూ .. ‘మదగదరాజా’ తర్వాత విశాల్‌తో కలిసి ‘మకుటం’ చేశాను. అప్పుడు విశాల్ హీరో.. ఇప్పుడు దర్శకుడు కూడా. ఇందులో నేను ఓ మంచి, పవర్ ఫుల్ రోల్ చేశాను. విశాల్ నా పాత్రని చాలా గొప్పగా డిజైన్ చేశాడు. విశాల్‌తో నాకు 15 ఏళ్ల బంధం ఉంది. ఆయన చాలా మంచి వ్యక్తి. ఆయనకు ‘మకుటం’తో హీరోగా, దర్శకుడిగా పెద్ద విజయం దక్కాలి. ఈ మూవీ కోసం విశాల్ ఎంతో కష్టపడ్డారు. ఆయన పడిన కష్టానికి తగ్గ ప్రతిఫలం రావాలని కోరుకుంటున్నాను.
ఆర్‌బీ చౌదరి బ్యానర్‌లోని 99వ సినిమాలో నేను హీరోయిన్‌గా నటించడం ఆనందంగా ఉంది. జీవీ ప్రకాష్ మ్యూజిక్ ఎప్పుడూ బాగుంటుంది. ఈ చిత్రంలోని ‘నచ్చాకే వచ్చేరా’ పాట నాకెంతో ఇష్టం. ఈ పాట పెద్ద హిట్ అవుతుంది. ‘మకుటం’ పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు.జితన్ రమేష్ మాట్లాడుతూ.. ‘విశాల్ మాకు ఎన్నో ఏళ్ల నుంచి తెలుసు. మా ఇంట్లో వ్యక్తిలా, సొంత అన్నలా ఉంటాడు. జీవీ ప్రకాష్ పట్టిందల్లా బంగారం అవుతుంది. మా ‘మకుటం’ మ్యూజిక్ కూడా పెద్ద హిట్ అవుతుందని అనుకుంటున్నాను.
విశాల్ ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం కాబోతోన్నాడు. అన్నీ తానై విశాల్ ఈ సినిమా కోసం పని చేస్తున్నారు. 99వ ప్రాజెక్ట్‌గా రాబోతోన్న ఈ చిత్రం పెద్ద విజయం కానుంది. వందో ప్రాజెక్ట్ అనేది మా నాన్న గారికి ఎంతో స్పెషల్. ఆయన కోరికను మేం నెరవేర్చుతాం. వంద కాదు రెండొందల ప్రాజెక్టులు చేసి ఆయన లెగసీని కంటిన్యూ చేస్తామ’ని అన్నారు.
నటుడు అజయ్ మాట్లాడుతూ .. ‘విశాల్ గారితో 20 ఏళ్ల క్రితం ‘భయ్యా’ అని ఓ మూవీని చేశాను. మళ్లీ ఇప్పుడు ‘మకుటం’ చేస్తున్నాను. దర్శకుడిగా విశాల్ ఎలా చేస్తారా? అని అనుకున్నాను. ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేశాను. ఆయన ఈ చిత్రంతో అద్భుతం క్రియేట్ చేయబోతోన్నారు’ అని అన్నారు.
నటి ఝాన్సీ మాట్లాడుతూ .. ‘‘నన్ను తమిళంలో పరిచయం చేస్తున్న విశాల్ గారికి థాంక్స్. సూపర్ గుడ్ ఫిల్మ్స్‌తో నాకు ఎంతో అనుబంధం ఉంది. హీరోగా, దర్శకుడిగా అన్ని రకాలుగా విశాల్ ఈ చిత్రంతో అద్భుతం చేశారు. ఇందులో నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. అంజలితో పని చేయడం ఆనందంగా ఉంది. ఇది మనందరి సినిమా. ‘మకుటం’ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
సింగర్ ప్రభ మాట్లాడుతూ .. ‘మకుటం’లో ఇంత మంచి పాటను పాడే అవకాశం ఇచ్చిన విశాల్ సర్‌కి, జీవీ ప్రకాష్ గారికి థాంక్స్. నేను ప్రైవేట్ ఆల్బమ్స్‌కి పాటలు పాడుతుంటాను. మొదటి సారిగా సినిమాకి పాడటం ఆనందంగా ఉంది’ అని అన్నారు.













