తమిళ హీరో సూర్యకు (Suriya) తెలుగులో భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అతడి తమిళ డబ్బింగ్ సినిమాలన్నీ టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాల స్థాయిలో రిలీజ్ అవుతుంటాయి. కరుప్పు బ్లాక్‌బస్టర్ తర్వాత కథల ఎంపికలో తన స్టైల్ మార్చిన సూర్య తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరితో విశ్వనాథ్ అండ్ సన్స్ (Vishwanath And Sons) సినిమా చేశాడు. ఫ్యామిలీ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాలో మమితా బైజు హీరోయిన్‌గా నటించింది. రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ పాన్ ఇండియన్ మూవీ శుక్రవారం తెలుగుతో పాటు తమిళంలో ఒకేసారి ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారీ అంచనాల నడుమ రిలీజైన ఈ మూవీ ఎలా ఉంది? తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి తమిళ హీరో సూర్యకు హిట్టు ఇచ్చాడా? అంటే?
కథ: సంజయ్ విశ్వనాథ్ (Suriya) షూటింగ్‌లో ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధిస్తాడు. నలభై ఏళ్లు దాటినా పెళ్లిచేసుకోడు. కొడుకు పెళ్లిని చూడాలని సంజయ్ తల్లి నిర్మల (రాధికా శరత్‌కుమార్) కలలు కంటుంది. సంజయ్‌తోనే తన వంశం ఆగిపోతుందని బెంగపెట్టుకుంది. సరోగసీ ద్వారా సంజయ్ తండ్రిగా మారతాడు. కొడుకుకు అభయ్ అని పేరు పెడతాడు. కానీ అభయ్‌కి బోన్‌మారియో సమస్య వస్తుంది. తల్లి డీఎన్ఏ అవసరం అవుతుంది. అమెరికాలో ఉన్న సరోగసీ మదర్ మదన కామేశ్వరి అలియాస్ మాడీ (మమితా బైజు)డబ్బు కోసం ట్రీట్‌మెంట్‌కు హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటుంది. సంజయ్‌తో కలిసి ఇండియా వస్తుంది. అభయ్‌కి ట్రీట్‌మెంట్ జరిగిన కొద్ది రోజుల్లోనే సంజయ్ మంచితనం చూసి మాడీ అతడితో ప్రేమలో పడుతుంది.
మాడీ తన అల్లరిపనులతో సంజయ్ తల్లితో పాటు ఇంట్లోవాళ్లందరికి దగ్గరవుతుంది. కానీ సంజయ్ మాత్రం మాడీ ప్రేమను రిజెక్ట్ చేస్తాడు. ఆమెను అమెరికా పంపించేయాలని అనుకుంటాడు. అప్పుడు మాడీ ఏం చేసింది? సంజయ్ మీద కేసు ఎందుకు పెట్టింది? సంజయ్ పెళ్లికి దూరంగా ఉండటానికి కారణమేమిటి? సంజయ్ తండ్రి నిర్మల ఉండగానే హీరోయిన్ అంజలిని (రవీనా టాండన్)ఎందుకు పెళ్లిచేసుకుంటాడు? అంజలి కుటుంబాన్ని ద్వేషించే సంజయ్ ఆమె కూతురి పెళ్లిని తన చేతులు మీదుగా ఎందుకు చేయాల్సివచ్చింది? మ్యాడీ ప్రేమకు ఓకే చెప్పాడా? అన్నదే ఈ మూవీ కథ.
నటీనటుల పనితీరు: గత కొన్నేళ్లుగా ఎక్కువగా మాస్ పాత్రలు, ప్రయోగాత్మక కథాంశాలతో సినిమాలు చేసిన సూర్య తన పంథాకు భిన్నంగా ఇందులో క్లాస్ రోల్‌లో కనిపించాడు. సంజయ్ విశ్వనాథ్ పాత్రలో అతడి లుక్, గెటప్ చాలా స్టైలిష్‌గా ఉన్నాయి. పాత్రకు తగ్గట్లుగా హుందాగా కనిపించాడు. ఈ సినిమాకు వన్ మెన్ షోగా నిలిచాడు. అల్లరి అమ్మాయిగా మమితా బైజు హుషారైన నటనను కనబరిచింది. ఆమె కామెడీ టైమింగ్, పంచ్‌లు సినిమాలో బాగా పేలాయి.
సూర్య, మమితా బైజు కాంబినేషన్‌లో వచ్చే సీన్లు నవ్విస్తూనే భావోద్వేగానికి లోను చేస్తాయి. హీరో తల్లి పాత్రకు సీనియర్ హీరోయిన్ రాధిక న్యాయం చేసింది. సూర్య, మమితాబైజుతో సమానంగా ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలో కనిపించింది. రవీనా టాండన్ అనుభవాన్ని డైరెక్టర్ సరిగ్గా వాడుకోలేదు. హైపర్ ఆది, రఘుబాబు గెస్ట్‌లుగా కనిపించారు. హీరో ఫ్రెండ్‌గా సునీల్ రెడ్డి కామెడీ అక్కడక్కడ వర్కవుట్ అయ్యింది. మిగిలిన పాత్రల్లో చాలా వరకు తమిళ నటులే కనిపించారు.
సాంకేతిక వర్గం పనితీరు: విశ్వనాథ్ అండ్ సన్స్ కోసం వెంకీ అట్లూరి ఎంచుకున్న పాయింట్ ఇన్నోవేటివ్‌గా ఉంది. తనకంటే వయసులో ఇరవై ఏళ్లు పెద్దవాడైన వ్యక్తితో ఓ యువతి ప్రేమలో పడటం అనే పాయింట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. కుటుంబ అనుబంధాలు, అప్యాయతలు, తల్లి గొప్పతనంతో ఆద్యంతం ఎమోషనల్ రైడ్‌గా ఈ సినిమాను మలిచారు. తన ఆఫీస్‌లో డ్రైవర్‌గా పనిచేసే వ్యక్తికి సూర్య విలువ ఇచ్చే సీన్, తల్లి చనిపోయిన సందర్భంలో వచ్చే ఎపిసోడ్ దర్శకుడిగా వెంకీ అట్లూరి ప్రతిభకు అద్దంపట్టాయి.
జీవీ ప్రకాష్ కుమార్ పాటల్లో నేనో బటర్ ఫ్లై సాంగ్ బాగుంది. బీజీఎమ్ మరి లౌడ్‌గా కాకుండా కథకు తగ్గట్లుగా అందించారు. ఈ సినిమాను తక్కువ బడ్జెట్‌లో కూడా తీయచ్చు. కానీ నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాత్రం ఖర్చు విషయంలో అస్సలు కాంప్రమైజ్ కాలేదు. లోకేషన్స్ చాలా రిచ్‌గా ఉన్నాయి. నిర్మాత పెట్టిన బడ్జెట్‌ను నిమిష్ రవి సినిమాటోగ్రఫీ మరింత ఎలివేట్ చేసింది. కథకు అడ్డు అనే ఆలోచనతోనే రెండు పాటలు, రెండు ఫైట్లు మాత్రమే సినిమాలో పెట్టారు. అనవసరపు ఎలివేషన్లు, హీరోయిజాలు, రొమాంటిక్ సీన్లు ఈ సినిమాలో లేవు.
విశ్లేషణ: హీరోహీరోయిన్ల మధ్య వయోభేదం అనే కాన్సెప్ట్‌తో దక్షిణాదిలో చాలా తక్కువ సినిమాలు వచ్చాయి. అలాంటి యూనిక్ కాన్సెప్ట్‌ను తీసుకొని హర్ట్ టచింగ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు వెంకీ అట్లూరి ఈ సినిమాను తెరకెక్కించారు. సింపుల్ స్టోరీనే ఎంచుకున్న వెంకీ అట్లూరి తన స్క్రీన్‌ప్లేతో మ్యాజిక్ చేశాడు. ఎమోషనల్ సీన్లను అతడు రాసుకున్న విధానం ఈ సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్‌గా నిలిచింది. పేజీలకు పేజీల డైలాగ్స్ ఈ సినిమాలో కనిపించవు. చాలా తక్కువ మాటలు, ఎక్కువగా ఎక్స్‌ప్రెషన్స్‌తో డ్రామా బాగా పండించాడు. చాలా లిమిటెడ్ క్యారెక్టర్లతోనే కథ నడుస్తుంది. అయినా ఎక్కడ బోర్ ఫీలింగ్ కలగదు.
ఒలింపిక్ విన్నర్‌గా సూర్య పాత్ర పరిచయం, ఆ తర్వాత పెళ్లి గురించి రాధిక పెట్టే పోరుతో రొటీన్‌గా ఈ సినిమా మొదలవుతుంది. మమితా బైజు ఎంట్రీ ఇచ్చిన తర్వాతే కథలో వేగం పెరుగుతుంది. భిన్న మనస్తత్వాలు కలిగిన వారు టామ్ అండ్ జెర్రీలా ఎప్పుడూ గొడవలు పడటం, తద్వారా జనరేట్ అయ్యే కామెడీతో ఫస్ట్ హాఫ్ సరదాగా సాగిపోతుంది.
హీరోయిన్‌ను తన ఇంటి నుంచి హీరో పంపించే సీన్‌తో ఇంటర్వెల్‌లో ట్విస్ట్ ఇచ్చారు. సెకండాఫ్‌లో రవీనా టాండన్ ఫ్యామిలీకి హీరో దగ్గరవ్వడం, ఈ క్రమంలో వచ్చే ఫ్యామిలీ సీన్లు ఫక్తు కమర్షియల్ ఫార్మెట్‌లో సాగుతాయి. ఓ పాట, ఓ ఫైట్, ఎమోషనల్ సీన్‌తో సెకండాఫ్‌ను నడిపించారు. క్లైమాక్స్‌ను ఇంకాస్త డెప్త్‌గా రాసుకుంటే బాగుండేది.
ప్రస్తుతం టాలీవుడ్‌లో యూత్‌ఫుల్ రొమాంటిక్ సినిమాలు లేదంటే వయలెన్స్‌తో కూడిన కథలదే హవా నడుస్తోంది. మంచి ఫ్యామిలీ సినిమా వచ్చి చాలా కాలమైంది. ఆ లోటును విశ్వనాథ్ అండ్ సన్స్ భర్తీ చేస్తుంది. ఒక్క బూతు సీన్, డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేకుండా క్లీన్ కామెడీతో ఈ సినిమా రూపొందడం ప్లస్సయ్యింది.
ఫోకస్ పాయింట్: పర్‌ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్
రేటింగ్: 3/5